న్యూయార్క్, సెప్టెంబర్ 21: గ్రీన్ కార్డులు లేదా పర్మినెంట్ రెసిడెంట్ కార్డులు ఉండి వాటి రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్న పౌరులు, వలసదారులకు అమెరికా శుభవార్త చెప్పింది. వారి పర్మినెంట్ రెసిడెంట్ కార్డుల చెల్లుబాటు కాలాన్ని మరింత పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ఈ కార్డుల కాల పరిమితి ముగిసిన తర్వాత మరో 24 నెలలు పొడిగించేవారు. ఇప్పుడు దానిని 36 నెలలకు పెంచారు. సాధారణంగా గ్రీన్‌కార్డు దారులు ప్రతీ ఐదేళ్లకోసారి వాటిని రెన్యువల్ చేసుకోవాలి. దానికోసం వారు ఐ-90 ఫామ్‌ను సమర్పించాలి.
చట్టబద్ధమైన శాశ్వత నివాసితులై ఫామ్ ఐ-90ని సమర్పించిన వారి శాశ్వత నివాసి కార్డులు లేదా గ్రీన్ కార్డు చెల్లుబాటును 36 నెలల పాటు పొడిగిస్తున్నట్టు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. దీంతో రెన్యువల్ కోసం వేచి చూస్తున్న వారికి ఇది ఎంతో ఉపశమనం కలిగించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి అమలులోకి వస్తున్నట్టు తెలిపింది. గ్రీన్ కార్డు గడువు ముగిసిన వారికి, పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గడువు ముగిసిన గ్రీన్ కార్డుల రెన్యువల్‌కు ఏడు నుంచి 12 నెలల సమయం పడుతుంది. దాంతో అది వచ్చేవరకు పౌరులకు టెన్షన్ తప్పేది కాదు. ఈ ఎదురుచూపులకు అడ్డుకట్ట వేయడానికే గడువును 36 నెలలు పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
గ్రీన్‌కార్డు దారులు అమెరికాలో ఎక్కడైనా ప్రయాణించడానికి అర్హులు. దేశం వెలుపల ఏడాది గడిస్తే వారి గ్రీన్ కార్డు గడువు ముగుస్తుంది. దాని పునరుద్ధరణ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్త విధానం ప్రకారం గ్రీన్ కార్డు పొడిగింపునకు అందుకున్న నోటీసుతో పాటు, గడువు ముగిసిన గ్రీన్ కార్డును రుజువుగా చూపెడుతూ వారు తామున్న చోట కొనసాగవచ్చు.
విద్యావంతులైన వలసదారుల్లో మనోళ్లే టాప్
అమెరికాలో విద్యావంతులైన వలసదారుల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నట్టు మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూటీ(ఎంపీఐ) అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 2022 నాటికి అమెరికాలో 1.40 కోట్ల మంది వలసదారులైన విద్యావంతులు ఉన్నారు. వీరిలో భారతీయులు 14 శాతం ఉన్నారని, ఆ తర్వాత చైనీయులు 7.9 శాతం, ఫిలిప్పిన్స్‌కు చెందిన వారు 6.9 శాతం ఉన్నారని ఎంపీఐ తెలిపింది. హెచ్-1బీ పొందుతున్న వారిలోనూ భారతీయుల సంఖ్య గణనీయంగా ఉందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన పిటిషన్లలో భారతీయులవే 72 శాతం ఉన్నట్టు తెలిపింది.