China Explosion | చైనాలోని ఓ కెమికల్ ప్లాంట్‌లో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలవగా.. 12 మంది గల్లంతయ్యారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది. ఈ ఘటన లియానింగ్ ప్రావిన్స్‌లోని పంజిన్ నగరంలో జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. 24 గంటల తర్వాత కూడా మంటలు ఉద్ధృతంగా ఉన్నాయి. మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు.
చైనా మీడియా సీసీటీవీ ప్రకారం, ప్రమాదం జరిగిన హయోయ్ కెమికల్ ఫ్యాక్టరీలో కొత్త యంత్రాలను అమర్చారు. దీంతో పాటు నిర్వహణ పనులు కూడా చేపట్టారు. ఫ్యాక్టరీలో తొలుత పేలుడు సంభవించింది. అనంతరం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో అదుపులోకి తీసుకురావడం చాలా కష్టంగా ఉన్నది. మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించాయి. అయితే పేలుడుకు గల కారణమేమిటో సమాచారం అందలేదు. ఈ ప్రమాదం తర్వాత ఫ్యాక్టరీల్లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాలు, ఫ్యాక్టరీలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని చైనా ప్రజలు కోరుతున్నారు.
చైనాలోని పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2019 లో పేలుడు జరగడంతో జియాంగ్సులోని పారిశ్రామిక పార్కును మూసివేశారు. ఈ పేలుడులో 78 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. 2015 లో ఓడరేవు పట్టణం టియాంజిన్‌లోని ఓ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 173 మంది చనిపోయారు.