ఇస్లామాబాద్: మహిళా సాధికారత, స్త్రీ ఆర్థిక స్వేచ్ఛపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంట్లో ఉండాల్సిన ఆడవాళ్లు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం వల్లే సమాజానికి ఈ దుస్థితి తలెత్తిందని మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వీడియోలో అన్వర్.. ‘కొంతకాలంగా నేను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాను. కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా, యూరప్ నుంచి వచ్చాను. యువకులు కుంగుబాటుకు లోనవుతున్నారు.
కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. భార్యభర్తలు గొడవలు పడుతున్నారు. డబ్బు కోసం మహిళలను పనికి పంపించడం వల్లే ఇదంతా..’ అని వ్యాఖ్యానించిన అతడు.. ఈ వివాదంలోకి కివీస్ సారథి కేన్ విలియమ్సన్నూ లాగాడు. “ఇదే విషయమై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాకు ఫోన్ చేసి ‘ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి’ అని అడిగాడు. ‘మా మహిళలు పనిచేయడానికి బయటకు వచ్చిన తర్వాతే మా సంస్కృతి నాశనమైందని ఒక ఆస్ట్రేలియా మేయర్ నాతో అన్నాడు” అంటూ అన్వర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాకిస్థాన్లో గత కొన్నాళ్లుగా విడాకుల సంఖ్య పెరగడానికి కూడా ఇదే కారణమని అన్వర్ అక్కసు వెళ్లగక్కాడు. అన్వర్ వ్యాఖ్యలపై నెటిజనులు, స్త్రీవాదులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు.