UN Chief: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా అమ్మాయి హత్యకు గురవుతోందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ ఆంటోనియో గుట్రెస్ అన్నారు. కుటుంబసభ్యుల చేతిలో లేదా భాగస్వామి చేతిలో మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. నవంబర్ 25వ తేదీని అంతర్జాతీయంగా మహిళలపై హింస నిరోధక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుట్రెస్ మాట్లాడుతూ.. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా అమ్మాయి మీద చనిపోతోందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్ల మీద హింస అనేది ఎన్నో రోజులుగా కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అని ఆయన తెలిపారు. ఇంట్లోవాళ్లు లేదా సహజీవనంలో ఉన్నవాళ్లు మహిళలు, అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా వేధించడానికి కరోనా ప్యాండెమిక్, ఆర్థిక సంక్షోభం వంటివి కూడా కారణమని గుట్రెస్ ప్రస్తావించారు.
ఆన్లైన్లోనూ మహిళలపై ట్రోలింగ్, స్టాకింగ్ వంటివి పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో సగం మంది మహిళలు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారని, దీనివల్ల అమ్మాయిలు, మహిళలు తమ హక్కులు, స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రాన్ని కోల్పోతున్నారని గుట్రెస్ విచారం వ్యక్తం చేశారు. అందుకని మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు ప్రపపంచదేశాలు ఒక కార్యచరణ అమలు చేయాలని గుట్రెస్ పిలుపునిచ్చారు. అంతేకాదు మహిళలపై దాడులు, హింస అనేవి ఇక చరిత్ర పుస్తకాల్లో చేరాల్సిన సమయం ఆసన్నమైందని ఐరాస సెక్రెటరీ అన్నారు.