Traffic Sense | రోమ్, జనవరి 23: చీమలకూ ట్రాఫిక్ సెన్స్ ఉంటుందని, అవి సమన్వయంతో, తెలివిగా ప్రయాణిస్తాయని ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్రెన్టోకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ప్రొఫెసర్లు మార్కో గెరియ్యేరి, నికోలా పుగ్నో నేతృత్వంలో చీమలదండు ప్రయాణంపై నిర్వహించిన అధ్యయనం వివరాలు ‘ట్రాన్స్‌పోర్టేషన్ రిసెర్చ్ ఇంటర్‌డిసిప్లీనరీ పెర్స్పెక్టీవ్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. డీప్ లెర్నింగ్ ద్వారా చీమల ప్రయాణతీరును గమనించారు.
ప్రయాణంలో చీమలు ప్లాటూన్గా ఏర్పడటం వంటి అనేక వ్యూహాలు పాటిస్తాయని, ఒకే వేగంతో వెళ్తాయని పరిశోధకులు గుర్తించారు. ఎంత రద్దీ ఉన్నా జామ్‌లు కానివ్వవని, ఓవర్‌టెక్ చేయవని తేల్చారు. మన రోడ్లపై వాహనాలు వెళ్లినట్టుగానే చీమలు సైతం ఇరు దిశల్లో ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. జామ్‌లను నివారించేందుకు చీమలు అనుసరిస్తున్న పద్ధతులను పట్టణాల్లో ట్రాఫిక్ జామ్‌ల నియంత్రణకు వినియోగించవచ్చని పరిశోధకులు సూచించారు. సెల్ఫ్ డ్రైవ్ వాహనాల తయారీలో చీమల ప్రయాణ వ్యూహాన్ని జోడించి సవాళ్లను అధిగమించొచ్చని పేర్కొన్నారు.