జెరూసలేం : సీజ్ఫైర్ తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య దాడులు ఆగినా.. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌ను వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌లోని మొత్తం గ్రామాలను ఒక క్రమ పద్ధతిలో నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేస్తున్నది. బాంబులు, పేలుళ్లతో అక్కడున్న ఇండ్లు, భవనాలను కూల్చివేస్తున్నది. దీనిపై ‘గార్డియన్’ కథనం ప్రకారం, ఇండ్లకు పేలుడు పదార్థాలను అమర్చి, వాటిని రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చేస్తున్నది. తైబే, నఖౌరా, డేర్సెర్యాన్ సరిహద్దు గ్రామాల్లో సామూహిక పేలుళ్లు జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం మూడు వీడియోలను విడుదల చేసింది. దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ విధ్వంసం కొనసాగుతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దక్షిణ లెబనాన్‌పై శనివారం నాటి దాడుల్లో 18 మంది చనిపోయారు. లెబనాన్‌తో శాంతి చర్చలు, ఒప్పందం హెజ్బొల్లాకు వర్తించదని నెతన్యాహు చెబుతున్నారు.
హెజ్బొల్లా మౌలిక సదుపాయాలు, ఉగ్రవాదులు నిర్మించిన టన్నెల్స్, మిలిటరీ స్థావరాల్ని మాత్రమే టార్గెట్ చేశామని, వీటిని పౌర ఆవాసాల్లో ఏర్పాటు చేసుకున్నందున ఇండ్లను పేల్చేస్తున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతున్నది. దక్షిణ లెబనాన్‌లోని పెద్ద పెద్ద ప్రాంతాలను ఆక్రమించుకొని, లిటాని నది వరకు ఆ ప్రాంతమంతటా విస్తరించి ఉండేట్టు ఒక ‘భద్రతా మండలాన్ని’ ఏర్పాటుచేస్తామని ఇజ్రాయెల్ చెబుతున్నది. ఆక్రమించుకున్న గ్రామాల్లోకి తిరిగి వచ్చేందుకు స్థానికులను అనుమతించబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
గాజాలో చేసినట్టుగా.. దక్షిణ లెబనాన్ గ్రామాలన్నింటినీ సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణమంత్రి కట్జ్ అంతక్రితమే ప్రకటించారు. పాలస్తీనాలోని రఫా, బీట్ హనౌన్‌లలో అనుసరించిన పద్ధతినే అనుసరిస్తామని చెప్పారు.