కీవ్: రష్యా దళాల దాడిలో యూరప్‌లోని అతిపెద్ద ఉక్కు కర్మాగారం ధ్వంసమైంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 25వ రోజుకు చేరింది. పోర్ట్ నగరమైన మారియుపోల్‌ను రష్యా దళాలు చుట్టుముట్టాయి. వారం రోజులుగా ఇక్కడ దాదులను తీవ్రం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారియుపోల్‌లో ఉన్న ఐరోపాలోనే అతి పెద్ద ఉక్కు పరిశ్రమ అజోవ్‌స్టాల్, రష్యా దళాల బాంబు దాడుల్లో ధ్వంసమైంది. దీని వల్ల ఉక్రెయిన్‌కు భారీగా ఆర్థిక నష్టమేగాక, పర్యావరణం కూడా నాశమైందని ఉక్రెయిన్ ఎంపీ లెసియా వాసిలెంకో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉక్కు కర్మాగారంపై రష్యా బాంబు దాడుల వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా, యూరప్‌లోనే అతి పెద్దదైన ఈ స్టీల్ ప్లాంట్‌ను రష్యా దళాలు ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశాయని మరో ఎంపీ ఆరోపించారు.
మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను రష్యా దళాలు ధ్వంసం చేయడంపై అజోవ్‌స్టాల్ డైరెక్టర్ జనరల్ ఎన్వర్ స్కిటిష్విలి సోషల్ మీడియాలో స్పందించారు. తాము నగరానికి తిరిగి వచ్చిన తర్వాత ఉక్కు కర్మాగారాన్ని పునర్నిర్మించి పూర్వవైభవాన్ని తీసుకోస్తామని తెలిపారు. అయితే రష్యా బాంబు దాడుల వల్ల ఉక్కు పరిశ్రమకు ఎంత నష్టం వాటిల్లిందో అన్నది వెల్లడించలేదు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించినప్పుడే పర్యావరణం దెబ్బతినకుండా ఉక్కు పరిశ్రమలో జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎన్వర్ తెలిపారు. బ్లాస్ట్ ఫర్నేస్‌ను సరిగ్గానే మూసివేసినట్లు చెప్పారు. కోక్ ఒవెన్ బ్యాటరీల వల్ల స్థానికులకు ఎలాంటి ముప్పు ఉండదని వివరించారు. కాగా, మెటిన్‌వెస్ట్ గ్రూప్‌కు చెందిన అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్, ఉక్రెయిన్‌లోని అత్యంత ధనవంతుడైన రినాట్ అఖ్మెటోవ్ ఆధీనంలో ఉంది.
#Mariupol #Azovstal One of the biggest metallurgic plants in #Europe destroyed. The economic losses for #Ukraine are huge. The environment is devastated #StopRussiaNOW pic.twitter.com/4GMbkYb0es
— Lesia Vasylenko (@lesiavasylenko) March 19, 2022