Vidyut Jammwal | బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో అపార నైపుణ్యం కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న విద్యుత్, తరచూ తన శారీరక సామర్థ్యాన్ని, క్రమశిక్షణను చూపించే వినూత్న వీడియోలతో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో విద్యుత్ పూర్తిగా ప్రకృతితో మమేకమై, ఎలాంటి దుస్తులు లేకుండా ఓ చెట్టుపైకి ఎక్కుతూ కనిపించారు. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. క్షణాల్లోనే వీడియో వైరల్ అవగా, దీనిపై రకరకాల స్పందనలు వెల్లువెత్తాయి.
ఈ వీడియో వెనుక అసలు కారణాన్ని విద్యుత్ స్వయంగా వివరించారు. తాను కేరళకు చెందిన పురాతన యుద్ధ కళ ‘కలరిపయట్టు’లో సాధకుడినని, ఆ సాధనలో భాగంగానే సంవత్సరానికి ఒకసారి ఇలా సహజ యోగ సాధన చేస్తానని తెలిపారు. సహజ స్థితికి తిరిగి వెళ్లడం, ప్రకృతితో అంతర్గత అనుబంధాన్ని పెంపొందించుకోవడమే ఈ సాధన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇది శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి, సమతుల్యతతో పాటు ఏకాగ్రతను పెంచుతుందని కూడా వివరించారు. వీడియోలో వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు ఎమోజీని ఉపయోగించినట్లు చెప్పారు.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు దీన్ని విద్యుత్ డిసిప్లిన్, ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్‌కు అంకితభావానికి నిదర్శనంగా ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం సరదా వ్యాఖ్యలు, మీమ్స్‌తో స్పందిస్తున్నారు. ఏదేమైనా, విద్యుత్ చేసిన ఈ ప్రయోగం చర్చకు మాత్రం కేంద్రబిందువుగా మారింది. సినిమాల విషయానికి వస్తే, విద్యుత్ జమ్వాల్ చివరిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘మదరాసి’ చిత్రంలో కనిపించాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా తనదైన యాక్షన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘స్ట్రీట్ ఫైట్’ రీబూట్‌లో యోగి ధల్సిమ్ పాత్రలో నటించనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో ‘ఆక్వామ్యాన్’ ఫేమ్ జాసన్ మోమోవా వంటి అంతర్జాతీయ స్థాయి నటులు కూడా భాగమవడం విశేషం. ఇలా దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా తన యాక్షన్ మార్క్‌ను విస్తరించేందుకు విద్యుత్ సిద్ధమవుతున్నాడు.