Shehbaz Sharif : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు అవమానం జరిగింది. ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షరీఫ్‌ను అవమానించారు. ట్రంప్ ఏర్పాటు చేస్తున్న అబ్రహం అకార్డ్స్‌లో చేరాల్సిందిగా ట్రంప్ పాకిస్తాన్‌ను కోరాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ వేదికగా ఈ విజ్ఞప్తి చేశాడు. అయితే, ఇందులో పాకిస్తాన్‌ను నడిపించే ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరు ప్రస్తావించలేదు. పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ పేరును ట్రంప్ ప్రస్తావించాడు.
ట్రంప్ ఇలా పాక్ ప్రధాని పేరునే ప్రస్తావించకపోవడం అంటే ఆయనను ఘోరంగా అవమానించినట్లే అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే అంతర్జాతీయంగా దేశాధినేతల్ని ప్రస్తావించేటప్పుడు ఎవరైనా ప్రోటోకాల్ ఫాలో అవుతారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎక్కువ అధికారాలు ఉన్న వారిని ముందుగా ప్రస్తావిస్తారు. పాక్‌లో ప్రధానికే అత్యధిక అధికారాలు ఉంటాయి. సైన్యాధ్యక్షుడికి పాలనపై అంతగా పట్టు ఉండదు. ఆయన సైన్యం వరకే పరిమితం. కాకపోతే, పాక్‌లో అప్పుడప్పుడూ సైనిక పాలన నడుస్తుంటుంది కాబట్టి.. అక్కడ సైన్యాధ్యక్షుడికి విలువ ఎక్కువ. అంతమాత్రాన ఆయన ప్రధానికంటే తక్కువ కాదు.
అలాంటిది ప్రధాని పేరు ప్రస్తావించకుండా, సైన్యాధిపతి పేరును ప్రస్తావించడం అంటే ట్రంప్ కావాలనే షెహబాజ్ షరీఫ్‌ను అవమానించినట్లు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇక్కడ ట్రంప్ పోస్ట్ ప్రకారం.. అబ్రహం అకార్డ్స్‌లో చేరేందుకు వివిధ ముస్లిం దేశాధినేతలతో మాట్లాడినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏ దేశంలో ఎవరితో మాట్లాడారో ట్రంప్ ప్రస్తావించారు. అలా పాకిస్తాన్లో అసిమ్ మునీర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. అయినప్పటికీ ఈ అంశంపై పాక్ ప్రధానిని పక్కనబెట్టి సైన్యాధ్యక్షుడితో ట్రంప్ చర్చించడం మరో వివాదానికి దారి తీసింది.
ఇజ్రాయెల్‌ను, ఇతర ముస్లిం దేశాలను కలిపి ట్రంప్.. అబ్రహం అకార్డ్స్ ఏర్పాటు చేశారు. దీనిపై 2020లో ఒక ఒప్పందం కుదిరింది. దీన్ని బలోపేతం చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ముస్లిం దేశాలు ఈ సమూహంలో చేరాలని ట్రంప్ కోరుతున్నారు. అయితే, ఏ ముస్లిం దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.