కాలిఫోర్నియా, డిసెంబర్ 1: ఫ్యాన్ ఆన్.. అని మెదడులో ఆలోచించగానే ఫ్యాన్ ఆన్ అయితే..! ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ఆలోచనలతోనే పనులన్నీ చేయగలిగితే..! ఇదేదో సైన్స్ ఫిక్షన్లా ఉంది కదూ! దాన్ని నిజం చేస్తున్నారు.. స్పేస్ఎక్స్, న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్. బటన్ నొక్కడం, టచ్ చేసి ఆపరేట్ చేయటం ఇక నుంచి గతం కానున్నది. కూర్చున్న చోటునుంచే ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ద్వారానే ఆపరేట్ చేయగలిగే చిప్‌ను అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆ చిప్‌ను మెదడులో అమర్చితే చాలు.. ఆలోచనలు ఆదేశాలుగా మారి పనులు జరిగిపోతాయి. కాలిఫోర్నియాలోని న్యూరాలింక్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో మస్క్ ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (బీసీఐ)’ సాంకేతికత వివరాలను తెలిపారు. ఈ టెక్నాలజీని మరో ఆరు నెలల్లో మనిషిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. దీని కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు సమర్పించే పత్రాలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎఫ్‌డీఏతో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని వివరించారు. ఈ సందర్భంగా మనిషి మెదడులో ప్రవేశపెట్టబోయే చిప్‌తో పాటు, దాన్ని అమర్చే రోబోను కూడా పరిచయం చేశారు.
ఇతర శరీర భాగాల్లోనూ..
మెదడుతో పాటు ఇతర శరీర భాగాల్లోనూ చిప్‌ను అమర్చేలా న్యూరాలింక్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పక్షవాతంతో బాధపడుతున్నవారిలో దెబ్బతిన్న అవయవాలను కదిలించేలా వెన్నుపూసలో అమర్చే చిప్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు మస్క్ తెలిపారు. కంటి చూపు కోల్పోయిన వారికోసం ఒక పరికరాన్ని తయారుచేస్తున్నట్టు వెల్లడించారు. ప్రయోగ పరీక్షల్లో భాగంగా.. మెదడులో చిప్ అమర్చిన కోతి ఎలా వ్యవహరిస్తుందో ఈ సమావేశంలో మస్క్ ప్రదర్శించారు. ఎలాంటి పరికరం అవసరం లేకుండానే కోతి వీడియో గేమ్ ఆడుతున్న వీడియోను చూపించారు. మెదడులో అమర్చిన చిప్ ద్వారా ఆ కోతి కంప్యూటర్‌కు ఆదేశాలు ఇస్తున్నదన్నారు. మానవమేధస్సును, సామర్థ్యాలను పెంచేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మస్క్ పేర్కొన్నారు.