ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు గట్టి షాకిచ్చాడు. ఇటీవలే తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆఫీసుకు రావలసిందేనని, లేదంటే ఉద్యోగాలు ఊడతాయని తేల్చిచెప్పేసిన మస్క్.. తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో కొత్తగా ఎవర్నీ చేర్చుకోకుండా హైరింగ్ ఆపేసినట్లు ప్రకటించాడు.
అంతేకాదు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏదో చెడు జరుగుతుందనే బ్యాడ్ ఫీలింగ్ ఉందని, అందుకే కంపెనీ ఉద్యోగుల్లో పది శాతం కోత విధించాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా హైరింగ్ ఆపేయండి’’ అనే టైటిల్‌తో ఎగ్జిక్యూటివ్స్ అందరికీ ఒక మెయిల్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్లోనే తన అనుమానాలను మస్క్ వెల్లడించాడు. దీంతో ఆ కంపెనీ ఉద్యోగులు టెన్షన్ పడిపోతున్నారు.