న్యూయార్క్: స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్(Elon Musk).. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలవనున్నారు. 2027 నాటికి ఆయన ట్రిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ తెలిపింది. ప్రతి ఏడాది మస్క్ ఆదాయం పెరుగుతున్న గణాంకాల ఆధారంగా ఈ అంచనా వేశారు. మస్క్ వార్షిక సంపద వృద్ధి సుమారు 109.88గా ఉన్నట్లు భావిస్తున్నారు. సోషల్ మీడియా ఎక్స్ ఓనర్ అయిన మస్క్.. ప్రస్తుతం 237 బిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు మస్క్ .. ఆరు కంపెనీలకు ఫౌండర్‌గా ఉన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్ దీంట్లో ఉన్నాయి. టెస్లా కంపెనీ మార్కెట్ విలువ 669.28 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఆ కంపెనీ విలువ ట్రిలియన్ డాలర్లకు వచ్చే ఏడాది చేరే అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచ సంపన్నుల్లో ట్రిలియనీర్లు కాబోనున్న ఇతర వ్యాపారవేత్తలను కూడా అంచనా వేశారు. ట్రిలియనీర్ క్లబ్లో చేరనున్న వారిలో భారతీయ వ్యాపారి గౌతమ్ అదానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్, ఇండోనేషియా మ్యాగ్నెట్ ప్రజోగో పంగెస్టు కూడా ఉన్నారు. 2028 వరకు ఈ ముగ్గురూ ట్రిలియనీర్లు అయ్యే ఛాన్సు ఉన్నట్లు ఇన్ఫార్మా కనెక్ట్ అంచనా వేసింది. ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లూయిస్ విట్టాన్ ఓనర్ బెర్నార్డ్ అర్నాల్ట్.. 2030 వరకు ట్రిలియనీర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
ఎలన్ మస్క్ తొలి సారి ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 2012లో కనిపించారు. అప్పుడు ఆయన ఆస్తి రెండు బిలియన్ల డాలర్లు. 2021లో తొలిసారి ఆయన ప్రపంచ కుబేరుల్లో బేజోస్ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. 2022 డిసెంబర్లో ఆయన కొన్నాళ్లు ఆ స్థానాన్ని కోల్పోయారు. మళ్లీ ఆర్నెళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు.