హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య స్నేహబంధం చెడినట్టే కనిపిస్తున్నది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుబడుతున్నారు. డోజ్ బాధ్యతల నుంచి వైదొలగడానికి ముందే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని నివేదికలు చెప్తున్నాయి. దానికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నట్టు శ్వేతసౌధం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లు: అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. ట్రంప్-మస్క్ మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ బిల్లుతో ధనికులకు 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర లబ్ధి చేకూరి, పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మరుగున పడుతాయని మస్క్ తప్పుబడుతున్నారు. ఇదో అసహ్యకరమైన బిల్లుగా ఆయన అభివర్ణించారు. రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చిన వారికి సిగ్గు ఉండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కిల్ ది బిల్’ అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండటం వల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగుతున్నది.
ఆల్ట్‌మన్‌తో భేటీ: మస్క్‌కు ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓపెన్ఏఐకు చెందిన చాట్‌బాట్ చాట్‌జీపీటీకి పోటీగా మస్క్ గ్రోక్‌ను తీసుకొచ్చారు. అయితే, తనను కాదని ఆల్ట్‌మన్‌తో ట్రంప్ ప్రైవేట్‌గా భేటీ కావడం మస్క్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది.
మస్క్‌పై పర్యవేక్షణ: డోజ్‌లో సభ్యుడిగా ఉన్న కొత్తలో శ్వేతసౌధానికి తరచూ వచ్చే మస్క్.. ట్రంప్‌తో అభిప్రాయభేదాలు మొదలైన తర్వాత వైట్‌హౌస్‌కు రావడాన్ని తగ్గించారు. ఇదే విషయమై అధ్యక్షుడు సూచనలు చేసినా ఆయన వైఖరి మారలేదు. దీంతో మస్క్‌కు అప్పజెప్పిన బాధ్యతలను పర్యవేక్షించడానికి, తనకు వివరాలు ఇవ్వడానికి ట్రంప్ మరో అధికారిని నియమించారు. ఇది మస్క్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది.
పార్టీలోనూ వ్యతిరేకత: ప్రభుత్వ వృథా ఖర్చు తగ్గింపునకు తొలుత మస్క్ ఇచ్చిన సూచనలను ట్రంప్ సహా పార్టీ సభ్యులు కూడా హర్షించారు. అయితే, రాజకీయ విషయాల్లోనూ మస్క్ జోక్యం చేసుకోవడం, నిబంధనలు కఠినతరం చేయడం అటు పార్టీలో, ఇటు ప్రజల్లోనూ విమర్శలను తీసుకొచ్చింది. దీంతో మస్క్ అధికారాలకు ట్రంప్ అనధికారికంగా కోత విధించారు. ఇదే సమయంలో డోజ్‌లో మస్క్ పదవీకాలం కూడా పూర్తైంది.
100 మిలియన్ డాలర్లు: ట్రంప్ పార్టీకి తన తరఫున 100 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తానని ఎన్నికల ముందు మస్క్ ప్రకటించారు. అయితే, ‘బిగ్ టాక్స్ బ్రేక్ బిల్లు’ కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించడంతో ఆ నిర్ణయాన్ని మస్క్ కోల్డ్‌స్టోరేజీలో పెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో ట్రంప్ కొంతకాలంగా మస్క్‌పై అసంతృప్తితో ఉన్నారు.