ఎలోన్ మస్క్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే మరో పేరు టెస్లా. ఎలక్ట్రిక్ కార్లలో టెస్లా రికార్డు సృష్టించింది. టెస్లాతో ఎలోన్ మస్క్ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. డ్రైవర్ రహిత ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించి ప్రపంచానికే సవాల్ విసిరాడు ఎలోన్ మస్క్. అయితే.. ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా విలువ ప్రస్తుతం కొన్ని బిలియన్ డాలర్లు ఉంటే.. అందులో 1.5 బిలియన్ డాలర్లు బిట్‌కాయిన్ రూపంలోనే ఉన్నాయి. 1.5 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 11,200 కోట్ల రూపాయలు.
2021 ముగింపు వరకు టెస్లా దగ్గర ఉన్న బిట్‌కాయిన్స్ వాల్యూ అది. యూఎస్ సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ)లో టెస్లా తాజాగా కంపెనీ ఆస్తులను ఫైలింగ్ చేసింది. అందులో బిట్‌కాయిన్స్‌ను జతచేసింది. అయితే.. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడం వల్ల.. టెస్లా గత సంవత్సరం 101 మిలియన్ డాలర్లు నష్టపోయింది. అంటే సుమారు 755 కోట్ల రూపాయలు అన్నమాట.
ఎలోన్ మస్క్ మొదటి నుంచి క్రిప్టోకరెన్సీలకు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. అందుకే గత సంవత్సరం క్రిప్టోకరెన్సీల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది.
2021లో బిట్‌కాయిన్‌ను టెస్లాలో పేమెంట్ ఆప్షన్‌గానూ లిస్ట్ చేశారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల క్రిప్టోకరెన్సీ ఆప్షన్‌ను టెస్లా తీసేసింది. కానీ.. భవిష్యత్తులో క్రిప్టోకరెన్సీ ఆప్షన్‌ను పేమెంట్‌లో చేర్చేందుకు టెస్లా ప్రయత్నిస్తోంది.
ఎలోన్ మస్క్ డోజీకాయిన్ అనే క్రిప్టోకరెన్సీని ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటాడు. అందుకే.. డోజీకాయిన్‌ను టెస్లాలో పేమెంట్ ఆప్షన్‌గా త్వరలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. షిబా పేరుతో డోజీకాయిన్ పేమెంట్ ఆప్షన్‌ను టెస్లా కారు కొనుగోలు కోసం టెస్లా ఇంటిగ్రేట్ చేస్తోంది.
గత సంవత్సరం టెస్లా 27 మిలియన్ డాలర్లు(200 కోట్ల రూపాయలు) క్రిప్టో లావాదేవీలను చేసింది. కానీ.. అందులో ఎక్కువగా నష్టాలనే టెస్లా చవిచూసింది.