ఏనుగులు కవలలకు జన్మనివ్వడం చాలా అరుదు. ఇలాంటి అరుదైన ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. అక్కడ 80 ఏండ్లలో తొలిసారిగా ఓ ఏనుగు కవల పిల్లలకు జన్మనిచ్చింది. 25 ఏండ్ల సురంజి అనే ఏనుగు.. ట్విన్స్‌కు జన్మనిచ్చినట్లు వన్యప్రాణి సంరక్షణ అధికారులు ప్రకటించారు. జన్మనిచ్చిన ఏనుగు సెంట్రల్ హిల్స్‌లోని పిన్నవాలా ఏనుగుల ఆశ్రమంలో ఉంటోంది. ఈ ఏనుగు పిల్లల తండ్రి పాండు (17) కూడా అక్కడే ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కవలలతో పాటు తల్లి ఏనుగు ఆరోగ్యకరంగా ఉన్నట్లు తెలిపారు.
శ్రీలంకలో చివరిసారిగా 1941లో ఓ ఏనుగు కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఏనుగులు కవలలకు జన్మనివ్వడం ఒక శాతం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆఫ్రికన్ ఏనుగులు సాధారణంగా కవల పిల్లలకు జన్మనిస్తాయని అధికారులు తెలిపారు. సాధారంగా ఏనుగులు తమ జీవితకాలంలో నాలుగు నుంచి ఐదు పిల్లలకు మాత్రమే జన్మనిస్తాయి. వైల్డ్ లైఫ్ అధికారిక రికార్డుల ప్రకారం శ్రీలంకలో 200 పెంపుడు ఏనుగులు, 7 వేల అడవి ఏనుగులు ఉన్నట్టు వెల్లడించారు.