న్యూఢిల్లీ : ఎల్‌నినో వచ్చేసింది. దీంతో భారతదేశంలో రుతుపవనాల వర్షపాతం తగ్గిపోవడం, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలపై ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. ప్రపంచంలోని అనేక వాతావరణ సంస్థలు ముందుగానే అంచనా వేసిన ఈ ఎల్‌నినో చారిత్రాత్మక స్థాయికి చేరుకొనే అవకాశం ఉన్నదని, దాని ప్రభావాలు వచ్చే ఏడాది వరకు కొనసాగవచ్చని భావిస్తున్నారు. చరిత్రలో ఎల్‌నినో తరచుగా కరువులు, వర్షపాతం లోటు, అధిక వేడి, పొడి వాతావరణ పరిస్థితులతో ముడిపడి ఉన్నది.
అందువల్ల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వర్షాలపై, జీవనోపాధి కోసం పంటల సాగుపై ఆధారపడే కోట్లాది భారతీయులకు దీని పునరాగమనం ఆందోళన కలిగిస్తున్నది. అయితే వాతావరణ శాస్త్రవేత్తలు మరో సముద్ర సంబంధిత వాతావరణ ఘటనపై కూడా దృష్టి సారిస్తున్నారు. అది ఎల్‌నినో ప్రతికూల ప్రభావాలను కొంతవరకు సమతుల్యం చేయగలదని భావిస్తున్నారు. ఇండియన్ ఓషన్ డైపోల్(హిందూ మహాసముద్ర ద్వి ధ్రువం-ఐవోడీ)గా పిలువబడే ఈ వాతావరణ నమూనా గతంలో ఎల్‌నినో దుష్ప్రభావాలను ఎదుర్కొని, భారతదేశం తీవ్రమైన రుతుపవనాల లోటును తప్పించుకోవడంలో సహాయపడింది. అందుకే ఇది ఏమిటి? భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది పశ్చిమ హిందూ మహాసముద్రం, తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతాల మధ్య సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల తేడాను సూచిస్తుంది. శాస్త్రవేత్తలు దీనిని మూడు దశలుగా వర్గీకరిస్తారు. పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్. ఎల్‌నినో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడితే ఐవోడీ హిందూ మహాసముద్రంలో ఏర్పడి దాని చుట్టుపక్కల దేశాల వాతావరణాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. పాజిటివ్ ఐవోడీ సమయంలో ఆఫ్రికా తీర ప్రాంతాల వద్ద సముద్ర జలాలు సాధారణం కంటే ఎక్కువ వేడిగా ఉంటాయి. అదే సమయంలో ఇండోనేషియా పరిసరాల్లోని జలాలు తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం గాలుల దిశను మార్చి భారత్‌వైపు ఎక్కువ తేమను తీసుకువస్తుంది.
ఫలితంగా వర్షపాతం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐవోడీ న్యూట్రల్ దశలో ఉంది. అయితే జపాన్ వాతావరణ సంస్థ(జేఎంఏ) ఈ ఏడాది చివర్లో పాజిటివ్ ఐవోడీ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచంలో ఎల్‌నినో ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించిన తొలి ప్రధాన వాతావరణ సంస్థ కూడా జేఎంఏనే. ఐవోడీ ఎలా అభివృద్ధి చెందుతుందో ఇంకా చూడాల్సి ఉంది. అయితే చరిత్రను పరిశీలిస్తే ఈ వాతావరణ ఘటన ఆశను కలిగిస్తున్నది. చరిత్ర చెబుతున్నదేమిటంటే పాజిటివ్ ఐవోడీ భారత రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించగలదు. దీనికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ 1997 సంవత్సరం. ఆ ఏడాది అత్యంత బలమైన ఎల్‌నినో సంభవించినప్పటికీ అదే సమయంలో బలమైన పాజిటివ్ ఐవోడీ కూడా ఏర్పడడంతో భారతదేశం తీవ్రమైన వర్షపాతం లోటును తప్పించుకున్నది. అందుకే ఈ ఏడాది శాస్త్రవేత్తలు హిందూ మహాసముద్ర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు.

అయితే పాజిటివ్ ఐవోడీ ఏర్పడినంత మాత్రాన సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని హామీ ఇవ్వలేమని వారు హెచ్చరిస్తున్నారు. దాని సమయం, తీవ్రత వంటి అంశాలపై అది ఎంతమేరకు సహకరిస్తుందో ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అనేక వాతావరణ అంశాలు ఒకేసారి ప్రభావం చూపుతున్నాయి. అత్యంత ప్రతికూల పరిస్థితిని నివారించాలంటే ఇవన్నీ అనుకూలంగా కలిసిరావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైన భారత రుతుపవనాల కాలం అత్యంత కీలకమైనది. నైరుతి రుతుపవనాలు భారతదేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 70 శాతం అందిస్తాయి. వర్షపాతం తీవ్రంగా తగ్గితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం విస్తృతస్థాయి కరువులు, పంటనష్టాలు, తీవ్రమైన నీటికొరత వంటి వరుస ప్రభావాలను ఎదుర్కొనవచ్చు. ఎల్‌నినో మరింత బలపడుతున్న నేపథ్యంలో రాబోయే నెలల్లో ఐవోడీ పాజిటివ్ దశలోకి మారుతుందా అనే అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమవుతున్నది. ఒకవేళ అది పాజిటివ్ దశలోకి మారితే భారత రుతుపవనాలకు అవసరమైన మద్దతును అందించి వానకాలాన్ని గాడిలో పెట్టే అవకాశమున్నది.
ఈ ఏడాది ఎల్‌నినో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అందరూ ఆందోళనకు గురవుతున్నారు. అయితే భవిష్యత్తులో మన వాతావరణాన్ని పూర్తిగా మార్చేసే మరో ముప్పు సైతం పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గ్రీన్లాండ్కు దక్షిణాన ఒక విచిత్రమైన ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలోని మిగతా ప్రాంతాలు ఉష్ణోగ్రతల పెరుగుదలను ఎదుర్కొంటున్నప్పటికీ, అక్కడ మాత్రం సముద్రం, వాతావరణం రెండూ చల్లబడుతున్నాయి. ఈ “కోల్డ్ బ్లాబ్” వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి పరిశోధకులు ఉపగ్రహ డాటా, అనేక రీ అనాలిసిస్ రికార్డులు, అలాగే 1955 నుంచి సముద్ర ఉష్ణోగ్రతల సమాచారాన్ని ఉపయోగించారు. ఇప్పటివరకు అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ కోల్డ్ బ్లాబ్కు రెండు ప్రధాన కారణాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు చర్చించారు. ఒకటి సముద్ర ప్రవాహాల ద్వారా ఈ ప్రాంతానికి చేరే వేడి తగ్గిపోవడం, మరొకటి సముద్ర ఉపరితలం నుంచి ఎక్కువ వేడి బయటకు వెళ్లిపోవడం. తాజా అధ్యయనం మొదటి సిద్ధాంతానికే మద్దతు ఇస్తున్నది.
పరిశోధకుల ప్రకారం.. పరిస్థితి ఇప్పుడు ఒక ప్రమాదకరమైన టిప్పింగ్ పాయింట్‌కు చాలా దగ్గరగా చేరుకున్నది. ఈ అధ్యయనం ఈ చల్లని ప్రాంతాన్ని, అట్లాంటిక్ మెరిడియోనల్ ఒవర్టర్నింగ్ సర్క్యులేషన్(ఏఎంవోసీ) బలహీనపడడానికి మధ్య సంబంధాన్ని చూపుతున్నది. ఈ ఏఎంవోసీ అనేది ఒక ప్రధాన సముద్ర ప్రవాహ వ్యవస్థ. ఇది కుప్పకూలే ప్రమాదానికి దగ్గరవుతున్నట్టు కనిపిస్తున్నది. అలా జరిగితే ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రభావం కనిపించవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. ఈ చల్లదనం సముద్ర ఉపరితలం నుంచి వేడి బయటకు వెళ్లిపోవడం వల్ల కాదు, లోతైన సముద్ర ప్రవాహాల్లో వచ్చిన మార్పుల వల్ల ఏర్పడుతున్నది. ఏఏంవోసీ పూర్తిగా కుప్పకూలితే ఐరోపాలో మరింత చల్లని, తీవ్ర శీతాకాలాలు ఏర్పడవచ్చు. అంతేకాకుండా ప్రపంచ వాతావరణ నమూనాలు, పర్యావరణ వ్యవస్థలు, ఆహార భద్రతపై కూడా గణనీయమైన ప్రభావాలు కనిపించవచ్చు. 2004 నుంచి మాత్రమే ఈ సముద్ర ప్రవాహ వ్యవస్థను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అందువల్ల ఇటీవలి పరిణామాల దీర్ఘకాలిక ధోరణిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తల వద్ద చాలా పరిమితమైన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.