ముజఫరాబాద్, జూలై 14: పాకిస్థాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మృతి చెందడంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ఈ ప్రాంత రాజధాని ముజఫరాబాద్‌కు ఈ నెల 15న భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రావల్కోట్ బస్ స్టాండ్‌లో పెద్దయెత్తున గుమిగూడిన మహిళలు, ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని పాక్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. పాక్ రేంజర్లు వారిపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో పాటు కాల్పులు కూడా జరిపారు. కాగా, ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందు అమెరికాలో నివసిస్తున్న పీవోకే ప్రవాసీయులు వాషింగ్టన్‌లోని శ్వేత సౌధం ముందు నిరసన తెలిపారు.
తమ ప్రాంతంలో రోజురోజుకు తీవ్రమవుతున్న మానవతా సంక్షోభంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని వారు కోరారు. సుమారు వంద మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో పీవోకేలోని పౌర నివాస ప్రాంతాల్లో మోహరించి ఉన్న పాకిస్థాన్ బలగాలను వెంటనే ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న నిరసనలపై మంగళవారం పాక్‌ను భారత్ తీవ్రంగా విమర్శించింది. ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా ఇస్లామాబాద్ వ్యవస్థాగత దోపిడీకి, ప్రాథమిక హక్కుల నిరాకరణకు, పరిపాలనా అణచివేతకు పాల్పడుతున్నదని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది.
పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీరు(పీవోకే)లోని మంగ్లా డ్యామ్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా ఉగ్రవాదులు జలమార్గం ద్వారా చేపట్టే కార్యకలాపాల కోసం శిక్షణ పొందుతున్న దృశ్యాలతో కూడిన ఒక కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. లష్కరేకి చెందిన సభ్యులు ఈత కొడుతున్నట్లు, నీటికి సంబంధించిన శిక్షణ పొందుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ఉగ్రవాదిగా అమెరికా గుర్తించిన హారిస్ దార్ కొత్తగా ఉగ్రవాద సభ్యులుగా చేరిన వారితో మాట్లాడుతూ ఈ ఏడాది ఏదో ఒక పెద్ద సంఘటన జరగబోతోంది అన్నట్లుగా ఉన్న ఒక వీడియో గతవారం బయటకు వచ్చింది.