Earthquake : చైనాలోని గ్వాంగ్జీలో భూకంపం (Earthquake) సంభవించింది. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు (Richter scale) పై 5.2 గా నమోదైంది. ఈ భూకంపం మూలంగా జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. లియుజౌ నగరంలో 7,000 మందికిపైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంప ప్రభావిత నైరుతి ప్రాంతంలో గాలింపు, సహాయక చర్యలు ముగిశాయి. భూకంపం నేపథ్యంలో రవాణాకు అంతరాయం కలుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.
అధికారులను ఉటంకిస్తూ ప్రభుత్వ మీడియా జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. శిథిలాల కింద చిక్కుకున్న 91 ఏళ్ళ వృద్దుడిని అధికారులు కాపాడారు. ఈ భూకంపం కారణంగా మరణించిన ఇద్దరిలో 63 ఏళ్ళ పురుషుడు, 53 ఏళ్ళ మహిళ ఉన్నారు. వీరు దంపతులని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని జిన్హువా వెల్లడించింది.
భూకంపం కారణంగా సోమవారం తెల్లవారుజామున లియుజైలో పదమూడంతస్తుల భవనాలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాలకు వెళ్ళే దారులు మూసుకుపోయాయి. ఎత్తైన భవనాల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగు తీశారు. వందల ఇళ్ళు కూలిపోయాయి.