Iran warning : పశ్చిమాసియా (West Asia) లో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ (Iran), అమెరికా (USA) మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ అధ్యక్ష కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారి సయ్యద్ మెహదీ తబాతబాయి (Seyyed Mehdi Tabatabaei).. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను ‘పిల్లల హంతకుడు (child-killer)’ అని సంబోధిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించి, ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అమెరికా చౌకబారు మైండ్ గేమ్స్, వాక్చాతుర్యం ప్రదర్శిస్తోందని తబాతబాయి ఆరోపించారు. శాంతి స్నేహాన్నే ఇరాన్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. కానీ ఎవరైనా మాతో బలప్రయోగం చేసే భాషలో మాట్లాడితే.. వారికి కఠినమైన చెంపదెబ్బ తప్పదని ఆయన హెచ్చరించారు. పిల్లల హంతకుడు ట్రంప్ తవ్విన గొయ్యి నుంచి అమెరికా అధికారులు బయటపడి, తమ దేశానికి తిరిగి వెళ్లాలని తబాతబాయి ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినప్పటి నుంచి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాల్పుల విరమణకు ముందు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో పౌరులు మరణించారని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా మినాబ్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడిలో వందమందికి పైగా బాలికలు మరణించారని ఇరాన్ చెబుతోంది.