తియాన్జిన్ (చైనా), ఆగస్టు 31 : డ్రాగన్, ఏనుగు ఒక్కటవ్వాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. బీజింగ్‌కు న్యూఢిల్లీ ఒక ముఖ్యమైన మిత్రుడని పేర్కొన్నారు. ఈ రెండు దేశాలు తమ బంధాన్ని వ్యూహాత్మకంగా, సుదీర్ఘకాల దృక్పథంతో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. చైనా పోర్టు నగరం తియాన్జిన్లో ఆదివారం ప్రారంభమైన రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆయన భారత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. స్నేహితులుగా ఉండటం, మంచి పొరుగువారిగా ఉండటం, డ్రాగన్, ఏనుగు కలిసి రావడం చాలా ముఖ్యమని జిన్‌పింగ్ అన్నారు.
సరిహద్దు సమస్య భారత్-చైనా సంబంధాన్ని నిర్వచించనివ్వకూడదని జిన్‌పింగ్ పేర్కొన్నట్టు ఆ దేశ పత్రిక జిన్హువా వెల్లడించింది. కాగా, భారత్-చైనా సరిహద్దు సమస్యపై న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు కలిసి పనిచేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అంగీకరించారు. పరస్పర విశ్వాసం, గౌరవం భారత్-చైనా సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గంటసేపు జరిగిన ఇరు నేతల సమావేశంలో సరిహద్దు ప్రతిష్టంభనపై ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఒప్పందం నుంచి కైలాస మానససరోవర్ యాత్ర పునః ప్రారంభం, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల పునరుద్ధరణ వరకు ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవలి పురోగతిని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. 280 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు ఈ రెండు దేశాల సహకారంతో ముడిపడి ఉన్నాయని, సర్వ మానవాళి సంక్షేమానికి ఇది మార్గదర్శనం చేస్తుందని మోదీ పేర్కొన్నారు.
పరస్పర నమ్మకం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా మన సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. కాగా, ఉగ్రవాదం, న్యాయమైన వాణిజ్యం వంటి ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు, ఉమ్మడి సవాళ్లపై బహుళపక్ష వేదికలకు విస్తరించడం అవసరమని ఇద్దరు నాయకులు భావించారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.