Xi Jinping : షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సు కోసం భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా (China) అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) తో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. భారత్-చైనా దేశాలు స్నేహంగా ఉండటం సరైన నిర్ణయమని అన్నారు.
ప్రధాని మోదీని మరోసారి కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జిన్‌పింగ్ చెప్పారు. గత ఏడాది కజన్‌లో ఇరువురి నేతల మధ్య జరిగిన భేటీని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు.. గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యులని అన్నారు. ఇరు దేశాల్లోని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంబంధాల పునరుద్ధరణ బాధ్యతను తాము భుజాన వేసుకున్నామని చెప్పారు.
పొరుగు దేశాలుగా తమ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల విజయాలకు దోహదపడే అంశాల్లో డ్రాగన్, ఏనుగు కలిసి రావడం సరైన ఎంపిక అన్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షికంగా స్థిర, దృఢమైన సంబంధాలు దీర్ఘకాలం కొనసాగేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు కోసం భారత్-చైనాలు బాధ్యత తీసుకోవాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.