Donald Trump | ఖతార్ వేదికగా భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన అక్కసు వెళ్లగక్కారు. భారత్‌లో యాపిల్ సంస్థను విస్తరించొద్దని ఆ సంస్థ సీఈవో (Apple CEO) టిమ్ కుక్ (Tim Cook)కు సూచించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా వెల్లడించినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదికను ఊటంకిస్తూ ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే తెలిపింది.
అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం అరబ్ దేశాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా నిన్న ఖతార్‌ను సందర్శించారు. ట్రంప్ కోసం ఎమిర్ ఆఫ్ ఖతార్ దోహాలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు పలువురు సీఈవోలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ విందుకు హాజరైన యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని టిక్ కుక్కు తెలియజేశారు. భారత్‌లో యాపిల్ సంస్థను విస్తరించొద్దని సూచించారు.
‘నాకు టిమ్ కుక్‌తో నిన్న చిన్న సమస్య ఎదురైంది. అతడు భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారు. అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను. ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్ అంగీకరించింది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. అక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టమని టిమ్ కుక్కు వివరించా. భారత్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ దేశం తనను తాను చూసుకోగలదని చెప్పా. నా వల్ల యాపిల్ సంస్థ ఇప్పుడు యూఎస్‌లో 500బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా (US), చైనా (China) దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం (Tariffs war) కారణంగా దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగానే అమెరికా మార్కెట్లో విక్రయించే ఐఫోన్ల (iPhone) తయారీకి సంబంధించిన పూర్తి అసెంబ్లీని భారత్‌కు తరలించాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాది సాధ్యమైనంత తొందరగానే అమెరికా ఫోన్లకు సంబంధించిన యాపిల్ ఐఫోన్ అసెంబ్లీ భారత్‌కు తరలించే అవకాశం ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని టిమ్ కుక్ ఇటీవల ప్రకటించారు. ఐపాడ్స్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్ వంటి ఉత్పత్తులను మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది.
Also Read..
Donald Trump | అమెరికాకు భారత్ జీరో టారిఫ్‌ల ఆఫర్ ఇచ్చింది : అధ్యక్షుడు ట్రంప్
India | టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలి.. ఐరాసలో తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్న భారత్
Israeli airstrikes | గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 54 మంది మృతి