BLA : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టి పాకిస్థాన్ (Pakistan) లోని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు (Terrorists) ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంట కవ్వింపులకు పాల్పడటంతో భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో కాల్పుల విరమణ కోసం పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనకు భారత్ అంగీకారం తెలిపింది.
ఈ నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. పాకిస్థాన్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని పరోక్షంగా హెచ్చరించింది. పాకిస్థాన్ ఊసరవెళ్లిలా రంగులు మారుస్తుందని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసమని పేర్కొంది. ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి విదేశీ మద్దతు ఉందంటూ వస్తున్న విమర్శలను బలూచిస్థాన్ తోసిపుచ్చింది.
తాము కీలు బొమ్మలం కాదని, పాకిస్థాన్ ఏంచేసిన చూస్తూ మౌనంగా ఉండబోమని పేర్కొంది. ఈ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుత, భవిష్యత్తు సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో తమకు సరైన స్థానం ఉందని చెప్పింది. తనను తాను డైనమిక్, నిర్ణయాత్మక పార్టీగా అభివర్ణించుకుంది. పాకిస్థాన్‌లోని బలూచ్ ప్రావిన్స్‌లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. అయితే దేశ వ్యవసాయ యోగ్య భూమిలో బలూచ్ వాటా కేవలం 5 శాతం మాత్రమేనని వెల్లడించింది.
బలూచ్‌లో కఠినమైన ఎడారి వాతావరణం ఉంటుందని, అందుకే పేదరికం ఎక్కువని బీఎల్ఏ తెలిపింది. ఎడారి ప్రాంతం కావడంతో జనాభా తక్కువగా ఉంటుందని, అందుకే అభివృద్ధికి దూరంగా ఉందని పేర్కొంది. అందుకే బలూచ్‌లో అనిశ్చితి నెలకొని వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారని చెప్పింది. ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారని తెలిపింది.