న్యూయార్క్, ఫిబ్రవరి 20: భారత్ ఎన్నికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరెవర్నో గెలిపించాలని మాజీ అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గత బైడెన్ ప్రభుత్వం రూ.181 కోట్ల నిధులు కేటాయించిందని ఇటీవల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) వెల్లడించింది. దీనిపై మియామిలో జరిగిన ఎఫ్ఐఐ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌లో ఓటింగ్ కోసం మనం 181 కోట్లు ఎందుకు ఖర్చు చేయాలి? వాళ్లు(బైడెన్ యంత్రాంగం) భారత్‌లో మరెవర్నో గెలిపించాలని ప్రయత్నించారని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి చెప్పాలి’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణలు గుప్పించింది. విదేశీ వ్యవస్థలతో రాహుల్ గాంధీ జతకట్టారని, భారతదేశ వ్యూహాత్మక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు విదేశీ శక్తుల చేతుల్లో పావుగా మారారని బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయ ఆరోపించారు. తాను మరోసారి అధికారంలోకి రాకుండా విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని 2024 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చెప్పిన మాటలను ట్రంప్ వ్యాఖ్యలు బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. 2023 మార్చిలో రాహుల్ గాంధీ లండన్ వెళ్లి భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా, ఐరోపాలోని విదేశీ శక్తులను కోరారని ఆరోపించారు. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు అర్థం లేనివని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. 1961లో యూఎస్ఏఐడీని స్థాపించారని, అప్పటినుంచి దశాబ్దాలుగా భారత్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు ఈ సంస్థ ఇచ్చిన నిధులపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భారత్‌లో ఎన్నికల కోసం యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఏఐడీ) నిధుల కేటాయింపు అంశంలో తెలుగు సంతతి మహిళ వీణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమె అమెరికా ప్రభుత్వంలో విదేశాంగ అధికారి. 2021 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు యూఎస్ఏఐడీకి భారత్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ నేపథ్యంలో యూఎస్ఏఐడీ భారత్‌లో ఎన్నికల కోసం ఇచ్చిన నిధులతో పాటు వీణారెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ మహేశ్ జఠ్మలానీ డిమాండ్ చేశారు. కాగా, వీణారెడ్డి ఏపీలో జన్మించి, అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె భారత్‌లో డైరెక్టర్‌గా పని చేసినప్పుడు దేశంలో విద్య, వైద్యం, ఎయిడ్స్ నివారణకు సంబంధించిన ప్రాజెక్టులకు యూఎస్ఏఐడీ నుంచి పెద్దఎత్తున నిధులు కేటాయించారు.
వాషింగ్టన్, ఫిబ్రవరి 20: భారత్‌లో టెస్లా పరిశ్రమను నిర్మించడం అమెరికాకు అన్యాయం చేయడమే అవుతుందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాజాగా ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌లో కారు విక్రయించడం ఎలాన్ మస్క్‌కు అసాధ్యం. ప్రపంచంలో ప్రతి దేశం సుంకాల ద్వారా మనల్ని ఉపయోగించుకుంటుంది.
ఉదాహరణకు భారత్‌లో ఒక కారు విక్రయించడం కూడా అసాధ్యం. ఒకవేళ ఆయన(ఎలాన్ మస్క్) భారత్‌లో పరిశ్రమను నిర్మించాలనుకుంటే నిర్మించుకోవచ్చు. కానీ, ఇది అమెరికాకు చాలా అన్యాయమే’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, భారత్‌లో ఇటీవల ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ నియామక ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థ త్వరలో భారత్‌లో పరిశ్రమను నెలకొల్పనున్నట్టు ప్రచారం జరుగుతున్నది.