Donald Trump : ఇరాన్ (Iran) తో జరుగుతున్న యుద్ధం, అంతకంతకే పెరుగుతున్న చమురు ధరల (Oil Price) పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని చెప్పారు. యుద్ధం ముగిసిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఇరాన్ అణ్వాయుధం పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు.
టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రచారసభలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ అణు ముప్పును ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యలను ఆయన సమర్థించుకున్నారు. అమెరికా సైనిక చర్యలు త్వరలో ముగిసే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. తాము త్వరలోనే ఇరాన్‌తో యుద్దం నుంచి బయటకు వస్తామని, ఆ తర్వాత చమురు ధరలు అమాంతం కిందకు పడిపోతాయని అన్నారు. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయన్నది వాస్తవమే అయినా ఊహించినంతగా పెరగలేదని చెప్పారు.
అమెరికా గత ప్రభుత్వాలు ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యాయని ట్రంప్ విమర్శించారు. చాలా ఏళ్ల క్రితమే ఈ సమస్యను పరిష్కరించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధం పొందనివ్వబోమని అన్నారు. ఇరాన్‌తో ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తన ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఈ వ్యవహారంలో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అయితే యుద్ధం ముగియాలనే తొందరలో ఏదో ఒక ఒప్పందాన్ని అంగీకరించేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టంచేశారు.