అక్రమాలకు అడ్డా సాస్
అక్రమ పునాదులపై వెలిసిన భారీ కట్టడాల వెనుక ప్రభుత్వ విభాగాల అవినీతి బాగోతం బట్టబయలైంది.
- లిఫ్టులు ఏర్పాటు చేస్తుండగా.. ఓ కార్మికుడి దుర్మరణం
- నెల కిందటే పనులన్నీ పూర్తయినట్లు హెచ్ఎండీఏ ఓసీ
- ఇప్పటికీ లిఫ్టులు, పవర్ సప్లయ్ పనులు కొనసాగుతున్న వైనం
- తాజా ప్రమాదంతో బయటపడిన సాస్-హెచ్ఎండీఏ అవినీతి
అక్రమ పునాదులపై వెలిసిన భారీ కట్టడాల వెనుక ప్రభుత్వ విభాగాల అవినీతి బాగోతం బట్టబయలైంది. కమర్షియల్ భవన నిర్మాణ సంస్థకు కొమ్ముకాసిన అధికారులు.. నిబంధనలను పూర్తిగా తుంగలో తొకి అక్రమారులకు దాసోహమయ్యారు. తౌతోనికుంటలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు సాస్ సంస్థ చేసిన ప్రయత్నాలు ఇప్పటికే వెలుగులోకి రాగా, తాజాగా ఆ సంస్థకు ప్రభుత్వ యంత్రాంగం ఏ స్థాయిలో వంతపాడిందో ఆధారాలతో సహా రట్టయింది.
భవన నిర్మాణ పనులు పూర్తికాకముందే నెల రోజుల కిందటే హెచ్ఎండీఏ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయడం వెనుక భారీ ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సాస్ ఐ-టవర్ కమర్షియల్ ప్రాజెక్టులో లిఫ్టులు, పవర్ సప్లయ్, చిల్లింగ్ స్టేషన్ పనులు చేస్తుండగా, తాజాగా జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందడంతో హెచ్ఎండీఏ అధికారుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. పనులు పూర్తికాకముందే ఓసీ ఎలా జారీ చేశారనేది ఇప్పుడొక మిస్టరీగా మారింది.
సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ నిబంధనల ప్రకారం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయాలంటే ఒక కమర్షియల్ భవనంలో నిర్మాణ పనులన్నీ కచ్చితంగా పూర్తవ్వాలి. ముఖ్యంగా భవన నిర్మాణంతో పాటు లిఫ్టుల ఏర్పాటు, అగ్నిమాపక వ్యవస్థ (ఫైర్ సేఫ్టీ), పవర్ బ్యాకప్, సెంట్రలైజ్డ్ చిల్లింగ్ స్టేషన్ల వంటి పనులన్నీ వంద శాతం పూర్తయి చేసి, వాటిని వినియోగంలోకి తీసుకురావాలి. కానీ అధికారులు ఇవేవి పట్టించుకోకుండా, అవినీతి పునాదులపై నిర్మించిన భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం ఇచ్చే కాసులకు కక్కుర్తిపడ్డారు.
బిల్డర్ వ్యవస్థలను దాసోహం చేసుకుంటే, హెచ్ఎండీఏ అధికారులు స్వయంగా భవనాన్ని సందర్శించి, అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరిగిందని నిర్ధారించుకున్న తర్వాతే ఓసీ విడుదల చేయాలి. అదేవిధంగా అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, పర్యావరణ విభాగాల నుంచి తుది అనుమతులు వచ్చిన తర్వాతే ఓసీ ఇవ్వాలి. కానీ సాస్ ఐ-టవర్ విషయంలో ఈ నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ అకడ లిఫ్టులు, చిల్లింగ్ స్టేషన్లు, పవర్ బ్యాకప్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ, నెల రోజుల కిందటే అంతా పూర్తయినట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు ఓసీ మంజూరు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
వ్యవస్థల వైఫల్యం
ఒక ప్రైవేట్ బిల్డర్ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యవస్థలు సాగిలపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఓసీ జారీ అయితేనే కమర్షియల్ స్పేస్‌ను ఇతర సంస్థలకు లీజుకు ఇవ్వడానికి, తద్వారా కోట్లాది రూపాయల అద్దెలు వసూలు చేసుకోవడానికి బిల్డర్‌కు వీలుంటుంది. బిల్డర్‌కు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకే అధికారులు నిబంధనలను గాలికొదిలేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి అసంపూర్తి భవనాలకు ఓసీ ఇవ్వడం వల్ల భవిష్యత్‌లో అకడ పనిచేసే వేలాది మంది ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్నది. అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్టులు సరిగ్గా లేకపోతే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిర్మాణ అనుమతుల నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ వరకు అంతా తప్పుల తడకగా, అక్రమాల పుట్టగా మారిందని తాజా ఘటన నిరూపించింది.
బాధ్యులపై చర్యలేవి?
కార్మికుడి ప్రాణం బలిగొన్న ఈ ప్రమాదం కేవలం సాధారణ విషయం కాదనీ, ప్రభుత్వ విభాగాల్లో పేరుకుపోయిన అవినీతికి, ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లకుండానే ఓసీపై సంతకాలు చేసిన హెచ్ఎండీఏ అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, తప్పుడు పత్రాలతో ఓసీ పొందిన సాస్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, జారీ చేసిన ఓసీని తక్షణమే రద్దు చేయాలని స్థానికులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

