వాషింగ్టన్: హోర్మజ్ జలసంధిని సుదీర్ఘ కాలం దిగ్భంధించే ఆలోచనలో ట్రంప్(Donald Trump) ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన తన క్యాబినెట్ మిత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని రాసింది. మరోవైపు ఇరాన్‌తో వార్ మూడో నెలలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఆ దేశంపై ఆర్థిక వత్తిడి తెచ్చే ఆలోచనలో అమెరికా ఉన్నది. ప్రభుత్వంలోని ముఖ్య, సన్నిహిత వ్యక్తులతో ట్రంప్ చర్చించారని, ఇరానీ ఇంధన ఎగుమతిపై ఆంక్షలు పొడిగించేందుకు నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఆ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన తన బృందానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇరానీ పోర్టుల దిగ్భంధాన్ని మరింత కాలం పొడిగించాలని భావిస్తున్నట్లు ఆ మీటింగ్‌లో ట్రంప్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్‌పై బాంబు దాడుల కన్నా.. హోర్ముజ్ జలసంధిని దీర్ఘకాలం దిగ్భంధించడమే తక్కువ రిస్క్‌తో కూడుకున్న అంశమని ట్రంప్ భావిస్తున్నట్లు రిపోర్టులో రాశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో దాదాపు ఇరాన్‌పై సైనిక చర్య ఆగినట్లే అవుతుంది. కానీ ఆ సంక్షోభానికి సంపూర్ణ పరిష్కారం దొరకనట్టు అవుతుంది. హోర్ముజ్ జలసంధిని సుదీర్ఘకాలం దిగ్బంధించడం వల్ల.. అక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోనున్నది. ఇరానీ పోర్టుల నుంచి హోర్ముజ్ ద్వారా ప్రయాణిస్తున్న షిప్‌లను అమెరికా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఇరానీ ఇంధన ఆదాయాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అమెరికా ఆ చర్యకు పూనుకున్నది. హోర్ముజ్‌లో బ్లాకేడ్‌ను ఎత్తివేయాలని ఇరాన్ కోరుతున్నట్లు మంగళవారం ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఆయిల్, గ్యాస్ షిప్మెంట్లను ఓపెన్ చేయాలని టెహ్రాన్ కోరుతున్నదన్నారు. అయితే హోర్ముజ్ అంశంలో అమెరికాతో ఇరాన్ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి.