న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: భారత్, రష్యాను చైనాకు చేజార్చుకున్నట్లు కనపడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో వ్యాఖ్యానించారు. ఆ మూడు దేశాల భవిష్యత్తు సుసంపన్నం కావాలంటూ ఆయన వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలియచేశారు. ఇటీవల టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ కావడంపై ట్రంప్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సదస్సు నేపథ్యంలో ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్ ద్వారా తన స్పందన తెలియచేశారు.
మోదీ, జిన్‌పింగ్, పుతన్ కలసి తీసుకున్న ఫొటోను ట్రంప్ షేర్ చేస్తూ భారత్, రష్యాను తాము చైనాకు చేజార్చుకున్నట్లు కనపడుతోందని పేర్కొన్నారు. ఆ ముగ్గురికి సుదీర్ఘ, సుసంపన్న భవిష్యత్తు ఉండాలంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ట్రూత్‌లో రాసిన మరో పోస్టులో ట్రంప్ చైనాపై ప్రశ్నాస్ర్తాలు సంధించారు. ఓ స్నేహరహిత విదేశీ దురాక్రమణదారుడి నుంచి స్వేచ్ఛను సాధించే క్రమంలో చైనా కోసం తన రక్తాన్ని త్యాగం చేసిన అమెరికాను చైనా ప్రస్తావిస్తుందా లేదా అన్న ప్రశ్నకు జీ జిన్‌పింగ్ నుంచి జవాబు కావాలని ట్రంప్ తెలిపారు.
చైనా విజయం కోసం పెద్ద సంఖ్యలో అమెరికన్లు మరణించారని, వారి పరాక్రమాన్ని, త్యాగాన్ని గౌరవించి, స్మరించుకోవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా విక్టరీ వేడుకల సందర్భంగా చైనా అధ్యక్షుడికి, ఆ దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నందుకు పుతిన్, జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు ఆయన వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.