వాషింగ్టన్: ఇరాన్‌తో శాంతి చర్చలు జరుగుతున్నట్లు చెప్పిన ట్రంప్.. మరో కీలక ఆదేశం ఇచ్చారు. ఇరాన్ భూభాగానికి సమీపంలో రెండు వేల మంది పారాట్రూపర్ల(Paratroopers)ను మోహరించారు. ఏ క్షణమైన వాళ్లు దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. భూతల దాడులు చేస్తే తిప్పికొడుతామని ఇరాన్ చెబుతున్న నేపథ్యంలో.. పెంటగాన్ అధికారులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. అమెరికన్ ఆర్మీలోని 82వ ఎయిర్‌బార్న్ డివిజన్‌కు చెందిన సుమారు 2000 మంది ఎలైట్ బలగాలు అందబాటులో ఉండనున్నాయి.
ఇరాన్ భూభాగానికి అతిసమీపంగా ఆ దళాలు మోహరించి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ కథనాలు రాశాయి. ఆదేశాలు ఇచ్చిన 18 గంటల లోపే విమానాశ్రయాలను, ఎంబసీలను సీజ్ చేసే సత్తా ఈ దళానికి ఉంటుంది. వీలైనంత మందిని తరలించగలరు కూడా. ఈ వారం చివరలో మరో 2500 మెరైన్లు కూడా గ్రౌండ్ ఆపరేషన్ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఖర్గ్ దీవిలో ఉన్న ప్రధాన ఆయిల్ ఎగుమతి కేంద్రాన్ని సీజ్ చేయాలన్న ఉద్దేశంతో అమెరికా ఉన్నట్లు భావిస్తున్నారు. దీని కోసమే పారాట్రూపర్లు రెఢీ అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌కు సమీపంగా వస్తే అమెరికా సైనికులను ఎలా ఎదుర్కోవాలో తమ దళాలకు తెలుసు అని ఇటీవల ఇరాన్ సీనియర్ మిలిటరీ అడ్వైజర్ అలీ అక్బర్ అహ్మదిన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఎయిర్‌బార్న్ డివిజన్ బేస్ నార్త్ కరోలినాలో ఉన్నది. ఆదేశాలు ఇచ్చిన 18 గంటల్లోనే ఈ ప్రాంతం నుంచి టార్గెట్‌కు ఈ దళం వెళ్లగలదు. ఇమ్మిడియేట్ రెస్పాన్స్ ఫోర్స్(ఐఆర్ఎఫ్) అని కూడా ఈ దళాన్ని పిలుస్తారు. 2021లో ఈ దళం ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్‌లో పాల్గొన్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ప్రభుత్వం తమ ఆపరేషన్స్ నిలిపివేసిన సమయంలో.. హమిద్ ఖర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ దళం వెళ్లింది.
ఎయిర్‌బార్న్ డివిజన్లో మొత్తం మూడు కంబాట్ బృందాలు ఉంటాయి. ఒక్కొక్క బృందంలో సుమారు 4 వేల మంది సైనికులు ఉంటారు. ఏవియేషన్ బ్రిగేడ్‌లో అటాక్, ట్రాన్స్పోర్ట్, కార్గో హెలికాప్టర్లు ఉంటాయి. ఓ ఆర్టిల్లరీ యూనిట్, లాజిస్టిక్స్ బ్రిగేడ్ కూడా ఉంటాయి. 82వ ఇన్ఫాంట్రీ డివిజన్‌ను మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఏర్పాటు చేశారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత డిమొబిలైజ్ చేశారు.
అయితే మళ్లీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సైనిక బృందాన్ని తీసుకొచ్చారు. 1942లో అమెరికన్ ఆర్మీకి చెందిన ఫస్ట్ ఎయిర్‌బార్న్ డివిజన్‌గా రూపాంతరం చెందింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 82వ ఎయిర్‌బార్న్ దళం పలు యుద్ధాల్లో పాల్గొన్నది. వియత్నం, గ్రెనడా, పనామా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాసియాలో ఐసిస్ ఆపరేషన్స్‌లో ఈ దళం విధులు నిర్వర్తించింది.