న్యూయార్క్: ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. అయితే డాక్టర్లు సూచించిన మోతాదు కన్నా ఎక్కువ మోతాదులో ఆస్ప్రిన్ మందు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. చేతులకు ఉన్న గాయాల్ని కనిపించకుండా ఉండేందుకు మేకప్ వేసుకోనున్నట్లు చెప్పారు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడానికి తన ఇష్టం లేదన్నారు. ద వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నట్లు గతంలో చెప్పానని, కానీ వాస్తవానికి గత అక్టోబర్‌లో తాను సీటీ స్కాన్ మాత్రమే చేయించుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
ట్రంప్ వయసు ప్రస్తుతం 79 ఏళ్లు. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడు ఆయనే. వృద్ధాప్య సమస్యలు ఆయన్ను బాధిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని మీటింగ్‌ల్లో ఆయన కునుకు తీస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు వినబడడం లేదు. గత 25 ఏళ్ల నుంచి మోతాదుకు మించి ఆస్ప్రిన్ మందును తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. గాయాలు త్వరగా అవుతాయని తెలిసినా తప్పడం లేదన్నారు. రక్తాన్ని పలుచగా మార్చేందుకు ఆస్ప్రిన్ ఉత్తమమైన మందు అని, గుండెలో ముదిరిన రక్తం ప్రవహించడం నాకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. ప్రతి రోజు 81 ఎంజీ డోసు ఆస్ప్రిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు, కానీ ట్రంప్ మాత్రం ప్రతి రోజూ 325 ఎంజీ ఆస్ప్రిన్ తీసుకుంటున్నట్లు తెలిసింది.