వాషింగ్టన్: ఇరాన్ వద్ద ఉన్న శుద్దీకరించిన యురేనియం గురించి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. యురేనియం విషయంలో ఫర్ఫెక్ట్ కేర్ తీసుకుంటామన్నారు. టెహ్రాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన కీలకమైన యురేనియం అంశంపై స్పందించారు. అంతర్జాతీయ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో జరిగిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. యురేనియం అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, ఒకవేళ ఆ అంశంపై డీల్ కుదరకుంటే తానేమీ తగ్గేవాడిని కాదన్నారు. ఇరాన్‌పై సాగిన సమరంలో అమెరికా పూర్తిగా, సమగ్రమైన విజయాన్ని సాధించిందని, ఇది 100 శాతం విక్టరీ అని, దీంట్లో ప్రశ్నలు లేవనెత్తే అంశమే లేదన్నారు. ఇరాన్ వద్ద సుమారు 500 కిలోల శుద్దీకరించిన యురేనియం ఉన్నట్లు కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే 38 రోజులగా సాగిన యుద్ధం కూడా యురేనియం కోసమే అన్న ఆరోపణలు వస్తున్నాయి.
అమెరికాతో కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరించినా.. ఆ దేశం మాత్రం యురేనియం అంశంలో పట్టుపట్టినట్లు తెలుస్తోంది. శుద్దీకరించిన యురేనియం నిల్వలు తమ వద్దే ఉంచుకునేందుకు అమెరికాపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. మధ్యవర్తుల సమక్షంలో 10 పాయింట్ల ప్లాన్‌కు అమెరికా,ఇరాన్ పరస్పరం అంగీకరించాయి. కానీ యురేనియం శుద్దీకరణ ప్రోగ్రామ్‌కు అనుమతి ఇవ్వాలని అమెరికాను ఇరాన్ వేడుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం అంశంలో ఇరాన్‌ను చైనా ప్రోత్సహించినట్లు తెలుస్తోందని ట్రంప్ తెలిపారు. దౌత్యం దిశగా ఇరాన్‌ను చైనా ఒప్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ అణ్వాయుధాన్ని సమకూర్చుకోవద్దు అంటే, అప్పుడు ఆ దేశానికి యురేనియం అందకుండా చేయాలని, ఈ అంశంలో అమెరికా పట్టుపట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో జరిగే శాంతి ఒప్పందంలో యురేనియం ప్రస్తావన తప్పకుండా ఉంటుందన్నారు. ఇరాన్‌ను దౌత్యమార్గం వైపు మళ్లించడంలో చైనా కీలక పాత్ర పోషించిందన్నారు. మే నెలలో ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఆయన భేటీ కానున్నారు. ఏప్రిల్‌లో జరగాల్సిన ఆ మీటింగ్‌ను ఇరాన్ వార్ వల్ల వాయిదా వేశారు. అమెరికాతో యుద్ధం సమయంలో ఇరాన్‌కు చైనా సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇరానీ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్న దేశంలో చైనా అగ్రస్థానంలో ఉన్నది.