వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రిపబ్లిక్ పార్టీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సమీపంలో కాల్పులు జరిగాయి. ఫోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అయితే కాల్పుల ఘటన అనంతరం ట్రంప్ సురక్షితంగానే ఉన్నారని, ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలేవీ లేవని ఆయన ప్రచార బృందం అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్ తెలిపారు. ట్రంప్ క్షేమమేనని ఆయన భద్రత వ్యవహారాలు చూసే సీక్రెట్ సర్వీస్ విభాగం కూడా ధ్రువీకరించింది. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిగాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు, అతని నుంచి ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారని న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా, ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా కాల్పుల శబ్ధాలు వినిపించాయని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే కాల్పులకు పాల్పడింది ఒక్కరా లేదా ఇద్దరా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, వారి ఉద్దేశం ఏంటనే విషయం తెలియదని వెల్లడించాయి. ఘటన గురించి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అధికారులు నివేదించారు. ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్టు కూడా సమాచారం లేదని స్థానిక పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్‌నకు సమీపంలోనే కాల్పులు జరిగాయని ఆయన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అన్నారు. పొదల్లో ఏకే 47 రైఫిల్ కూడా లభించిందని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నారని చెప్పారు. అనుమానితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
Again folks!
SHOTS FIRED at Trump Golf Course in West Palm Beach, Florida.
An AK-47 was discovered in the bushes, per local law enforcement. The Trump campaign has released a statement confirming former President Trump is safe.
A suspect has reportedly been apprehended. pic.twitter.com/FwRfrO3v6y
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) September 15, 2024
కాగా, ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్‌కు అధికారుల సమాచారం అందించారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు, సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కాల్పులు ఘటనపై ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తాను ట్రంప్‌తో మాట్లాడానని, తను క్షేమంగానే ఉన్నాడన్నారు. తాను చూసిన వక్తుల్లో ఆయన చాలా బలవంతుడన్నారు.
ట్రంప్ పై రెండు నెలల క్రితమే హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్ అనే వ్యక్తి సమీపంలోని గోడౌన్ మీదినుంచి ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కుడి చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లింది. ట్రంప్ రక్తమోడుతూనే అమాంతం డయాస్ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్నారు. నాటినుంచి ఆయనకు భద్రతను మరింత పెంచారు.