America | న్యూఢిల్లీ, మార్చి 24: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర సెల్ఫీ తీసుకోవాలని, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పైనుంచి నగర అందాలను వీక్షించాలని కలలు కంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి… అంతర్జాతీయ సందర్శకులుగా అమెరికాలో మీ హక్కులేమిటో ముందు తెలుసుకోండి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత తన ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాల మేరకు ఆయన కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలను పునఃప్రవేశపెట్టారు. ఇటీవలి కాలంలో అమెరికాకు పయనమైన వందలాది మంది పర్యాటకులు సరిహద్దుల వద్దే బందీలుగా మారడం విదేశీ పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తుండగా అమెరికా విధానాలపై ఇతర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సవ్యమైన ట్రావెల్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ అమెరికా సరిహద్దు అధికారులు పర్యాటకులను అడ్డగించి సోదాలు చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఒక వ్యక్తిని దేశంలోకి అనుమతించాలా వద్దా అన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఎంట్రీ పాయింట్ల వద్ద ఎవరినైనా ఆడ్డుకునే అధికారం అమెరికా కస్టమ్స్ అధికారులకు ఉంది. మీరు తప్పు చేయనప్పటికీ, అనుమానాస్పదంగా కనిపించనప్పటికీ మీ లగేజీని, వ్యక్తిగత వస్తువులను తనిఖీ చేసే అధికారం వారికి ఉంది. అంతేకాదు మీ మొబైల్ ఫోన్లు, లాప్టాప్లను కూడా కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయవచ్చు. కొన్ని సందర్భాలలో పర్యాటకుల ఎలక్ట్రానిక్ పరికరాల పాస్‌వర్డ్‌లను కూడా వారు అడుగుతారు. పాస్‌వర్డ్‌లను ఇవ్వడానికి పర్యాటకులు నిరాకరించిన పక్షంలో అమెరికన్ పౌరుడైతే అనుమతి లభించడానికి కొద్దిగా జాప్యం జరగడం, లేదా పరికరాన్ని తదుపరి పరిశీలన కోసం అధికారులు తమ వద్దే ఉంచుకోవడంతో సరిపెట్టవచ్చు. అదే విదేశీ పర్యాటకులు అయితే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు.
ఇక వీసా రద్దు కార్యక్రమం కింద దాదాపు 40 దేశాలకు చెందిన విదేశీ పర్యాటకులు టూరిజం లేదా వ్యాపార నిమిత్తం వీసా లేకుండానే అమెరికాలో 90 రోజులపాటు గడపవచ్చు. అమెరికా పౌరులు కూడా అదే తరహాలో ఆయా దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. అయినప్పటికీ తమ విమానం బయల్దేరడానికి కనీసం 72 గంటల ముందు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్(ఈఎస్టీఏ) కోసం పర్యాటకులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈఎస్టీఏ ఉన్న వారు అమెరికాలో శాశ్వతంగా చదువుకోవడానికి లేదా పనిచేయడానికి అర్హులు కారు. వారికి చాలా పరిమితమైన హక్కులు ఉంటాయి. డిపోర్టేషన్ నుంచి మాత్రం స్వల్పంగా రక్షణ ఉంటుంది.
అమెరికాకు ప్రయాణించే అమెరికాయేతర పౌరులు తమ వెంట ఇమ్మిగ్రేషన్ న్యాయవాది లేదా అత్యవసర పరిస్థితులలో సంప్రదించవలసిన వ్యక్తి వివరాలను ఉంచుకోవాలని పౌర హక్కుల గ్రూపులు సూచిస్తున్నాయి. ఒకవేళ మిమ్మల్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న పక్షంలో అధికారుల ఆదేశాలను కచ్చితంగా పాటించడంతోపాటు తక్షణమే న్యాయ సహాయకుడిని సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. సరిహద్దు ఎంట్రీ పాయింట్ల వద్ద అధికారులు ప్రశ్నించినపుడు మౌనంగా ఉండడం కూడా ఒక్కోసారి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని వారు చెబుతున్నారు. మీ సందర్శనలో పని చేయాలని భావిస్తున్నారా అని అధికారులు ప్రశ్నించినపుడు జవాబివ్వకుండా మౌనంగా ఉంటే దేశంలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోవలసి వస్తుందని పౌర హక్కుల గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. ప్రవేశం నిరాకరణకు గురైన పర్యాటకులు తమ దరఖాస్తులను ఉపసంహరించుకుని స్వదేశానికి వెళ్లిపోవడానికి అధికారులు అనుమతించే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో వీసా రద్దయి తదుపరి అందుబాటులో ఉన్న విమానంలో వెనక్కు పంపించివేస్తారు.