వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనీచేశారు. టారిఫ్ వార్ (Tarrif War) షురూ చేశారు. ఒకే సారి మూడు దేశాలపై సుంకాలు విధించి ఝలక్ ఇచ్చారు. కెనడా, మెక్సికో చైనా దేశాలపై టారిఫ్లు విధించారు. కెనడా, మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దేశంలో తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేందుకు ఈ సుంకాలను ఉపయోగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
మెక్సికో, కెనడా దిగుమతులపై 25 శాతం (కెనడియన్ ఎనర్జీపై 10 శాతం), చైనాపై 10 శాతం అదనపు సుంకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) ద్వారా ఈ సుంకాలు విధించానని తెలిపారు. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉన్నదని, అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా తన కర్తవ్యమని వెల్లడించారు. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని తెలిపారు.
కాగా, ఈ సుంకాలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దుల్లోకి వచ్చే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉందనుంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా, కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడే ముప్పు పొంచిఉన్నది. అదేవిధంగా ఉత్తర అమెరికాపై ప్రభావం చూపనుంది.
“We need to protect Americans, and it is my duty as President to ensure the safety of all. I made a promise on my Campaign to stop the flood of illegal aliens and drugs from pouring across our Borders, and Americans overwhelmingly voted in favor of it.” –President Trump pic.twitter.com/rJ9opLBJzr
— The White House (@WhiteHouse) February 1, 2025