వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్బుక్, ట్విటర్లాంటి సోషల్ మీడియా సైట్లు నిషేధం విధించిన సంగతి తెలుసు కదా. ఇక లాభం లేదనుకొని తానే సొంతంగా ఓ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకున్నారాయన. దీని పేరు ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జే ట్రంప్. www.DonaldJTrump.com/desk యూఆర్ఎల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో ట్రంప్ మాత్రమే ఏదైనా పోస్ట్ చేయగలరు. ఇది ఇంచుమించు ట్విటర్‌లాగే కనిపిస్తోంది. తన అభిప్రాయాలను దీని ద్వారా అభిమానులతో ట్రంప్ పంచుకోనున్నారు. కాకపోతే ఇది కేవలం వన్ వే కమ్యూనికేషనే. అంటే ట్రంప్ మాత్రమే పోస్ట్ చేయగలరు. ఆయన అభిమానులు కేవలం వీటిని చూడగలరు తప్ప రిప్లై ఇవ్వలేరు.
సేవ్ అమెరికా పేరుతో లోగోను తయారు చేశారు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేయగలమని విశ్వసిస్తున్నాం అని ఈ వెబ్సైట్ చెబుతోంది. వర్డ్‌ప్రెస్ బ్లాగ్ ద్వారానే ఈ ట్విటర్లాంటి కొత్త ప్లాట్‌ఫామ్‌ను ట్రంప్ తయారు చేసుకున్నారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులోనూ లైక్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. మంగళవారమే ఈ కొత్త ప్లాట్‌ఫామ్ లాంచైనా.. ఇందులో మార్చి నుంచే ట్రంప్ చేస్తున్న పోస్ట్‌లు ఉన్నాయి. ట్రంప్‌ను గత జనవరిలో ట్విటర్, ఫేస్బుక్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.