India-US trade deal : ఇండియా-అమెరికా మధ్య చాలాకాలం క్రితమే ట్రేడ్ డీల్ కుదరాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా దీనికి సంబంధించి అసలైన కారణం వెల్లడైంది. ఈ ట్రేడ్ డీల్ ఆగిపోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్ హౌజ్ అడ్వైజర్ పీటర్ నవ్వారో అని వైట్‌హౌజ్ సెక్రెటరీ టెడ్ క్రూజ్ అన్నారు. ఈ అంశంపై ఆయన ఒకరితో మాట్లాడిన ఆడియో అమెరికాలో వైరల్ అవుతోంది.
గత ఏడాది ప్రారంభంలో టెడ్ కొంతమంది వ్యాపారస్తులు, డోనర్లతో ఫోన్లో ఈ మాటలు మాట్లాడినట్లు తెలుస్తోంది. పది నిమిషాల నిడివి గల ఆడియో ప్రకారం.. ట్రేడ్ టారిఫ్‌ల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ట్రంప్‌ను హెచ్చరించారు. అలాగే అభిశంసన ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ట్రంప్‌కు సూచించినట్లు చెప్పారు. గత ఏప్రిల్‌లో టారిఫ్‌లు పెంచిన తర్వాత తనతోపాటు మరికొందరు సెనేటర్లు కలిసి ట్రంప్‌కు అర్ధరాత్రి ఫోన్ చేసి, వీటిపై పునరాలోచించాలని సూచించినట్లు టెడ్ చెప్పారు. ట్రంప్ చర్యల వల్ల 2026 నవంబర్‌కల్లా దేశంలో నిత్యావసరాల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని, రిటైర్మెంట్ అకౌంట్స్ 30 శాతం వరకు పడిపోతాయని హెచ్చరించినట్లు తెలిపారు. రిపబ్లికన్లు ఎన్నికల్లో నష్టపోతారని కూడా సూచించినట్లు చెప్పారు.
రెండేళ్లలో వైట్‌హౌజ్‌కు దూరమవుతారని, సెనేటర్లను కోల్పోతారని, ప్రతివారం అభిశంసన ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్‌నకు వార్నింగ్ ఇచ్చామన్నారు. అయితే, ట్రంప్ తమపై అసభ్యపదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఈ ఆడియో ద్వారా ట్రంప్ ప్రభుత్వంలో సెనేటర్లకు, ఆయనకు మధ్య గ్యాప్ ఉందని, విబేధాలున్నాయని తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, అమెరికా మాత్రం.. భారత ప్రధాని మోదీ.. ట్రంప్‌తో నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని చెబుతోంది.