వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్బంధించిన అనంతరం లాటిన్ అమెరికాలోని తమ ప్రత్యర్థి దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేశారు. మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదక ద్రవ్యాలను అమెరికాలోకి అక్రమంగా సరఫరా చేస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే వెనెజువెలా పరిస్థితే వాటి పడుతుందని స్పష్టంచేశారు. ట్రంప్ శనివారం ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, మెక్సికోను నడుపుతున్నది ప్రెసిడెంట్ క్లౌడియా షీన్బామ్ కాదని, శక్తిమంతమైన డ్రగ్ కార్టెల్స్ నడుపుతున్నారని ఆరోపించారు.
మెక్సికోకు ఏదో చేయాల్సి ఉందన్నారు. క్యూబా విఫల రాజ్యమని ఆరోపించారు. క్యూబా ప్రజలకు సాయపడాలని అనుకుంటున్నామని ట్రంప్ అన్నారు. క్యూబా నుంచి బలవంతంగా వెళ్లగొట్టబడిన వారికి కూడా సాయం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో కనీసం మూడు భారీ కొకైన్ ఫ్యాక్టరీలకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఆ కొకైన్‌ను అమెరికాలోకి పంపిస్తున్నారన్నారు. వెనెజువెలాపై అమెరికా దాడులను కొలంబియా తీవ్రంగా ఖండించింది. దక్షిణ అమెరికాలోని అన్ని దేశాలకు ముప్పు పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది.