వాషింగ్టన్, న్యూఢిల్లీ: భారత దేశంలోని దేశీయ పరమాణు సంబంధిత సంఘటనలపై బాధ్యతలకు సంబంధించిన నిబంధనలు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అమెరికా చెప్పింది. ఇటీవల భారత పార్లమెంట్ శాంతి బిల్లును ఆమోదించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 19న నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)పై సంతకం చేశారు. ఈ చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ భారత ప్రభుత్వంతో ఉమ్మ డి సంప్రదింపుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. 2008నాటి ఇండో-యూఎస్ అణు శక్తి ఒప్పందం అమలును మదింపు చేయాలి.
యూఎస్-ఇండియా వ్యూహాత్మక భద్రత చర్చల పరిధిలో ఈ సంబంధాలను నెలకొల్పుకోవాలి. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా భారత దేశ దేశీయ అణు శక్తి, అణు విద్యుత్తు ఉత్పత్తి, నష్ట పరిహార నిబంధనలు ఉండేలా చూడాలి. శాంతి బిల్లు ప్రకారం ఈ బాధ్యతను రూ.3,000 కోట్లకు పరిమితం చేశారు. అణు ప్రమాదం జరిగినపుడు సివిల్ బాధ్యతపై వియెన్నా ఒప్పందానికి దాదాపు అనుగుణంగా శాంతి బిల్లు ఉంది. అదే విధంగా అణు ప్రమా దం జరిగినపుడు అనుబంధ నష్టపరిహారంపై ఒప్పందానికి కూడా అనుగుణంగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సయోధ్య కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ శనివారం ఎక్స్‌లో దీనిపై పోస్ట్ చేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ‘ఒకప్పటి మంచి మిత్రుడి’తో శాంతిని పునరుద్ధరించుకోవడానికి, అమెరికా ప్రయోజనాలను కాపాడటం కోసం శాంతి బిల్లును పార్లమెంటులో బుల్డోజ్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ పోస్ట్‌లో ఆయన నేరుగా ట్రంప్ పేరును ప్రస్తావించలేదు.
ట్రంప్ ఈ నెల 19న ఎన్డీఏఏపై సంతకం చేసిన నేపథ్యంలో జైరామ్ రమేశ్ ఈ ఆరోపణలు చేశారు. అణు ప్రమాద పరిహార నిబంధనలపై భారత్, అమెరికా మధ్య ఉమ్మడి మదింపు జరగాలని ఎన్డీఏఏలో ప్రత్యేకంగా పేర్కొన్నవిషయాన్ని ఆయన ప్రస్తావించారు. శాంతి బిల్లును పార్లమెంటులో బుల్డోజ్ చేయడం వెనుకగల అసలు కారణం బయటపడిందన్నారు. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, 2010 నిబంధనలను తొలగించడంతోపాటు ఇతర అంశాలను పక్కనబెట్టి ఈ బిల్లును పాస్ చేశారని దుయ్యబట్టారు.