హైదరాబాద్, ఫిబ్రవరి 6 ( నమస్తే తెలంగాణ ) : అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్న ట్రంప్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దీంతో భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ ఆవిరవుతున్నాయి. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆంక్షలేమీ లేకపోవడంతో స్టడీ వీసాపై వెళ్లినవాళ్లు అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునేవారు. ట్రంప్ రాకతో ఒక్కసారిగా అమెరికాలో సీన్ మారిపోయింది. తాజా పరిణామాలు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(జీటీఏ) ఫౌండర్ అండ్ చైర్మన్ కే విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అమెరికాలో తాజా పరిస్థితులపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
ప్రశ్న : అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా ఝళిపిస్తున్నారు . దాని ప్రభావం మన విద్యార్థులపై ఏ మేరకు ఉంటుంది?
జవాబు : భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం వంద శాతం ఉంటుంది. పార్ట్‌టైం జాబ్ చేస్తూ దొరికితే సత్వరమే డిపోర్టేషన్ కింద భారతదేశానికి తిరిగి పంపేస్తారు. కాలేజీలకు కట్టిన ఫీజు సైతం మన విద్యార్థులు కోల్పోతారు.
ప్రశ్న : డిపోర్టేషన్ భయంతో భారతీయ విద్యార్థులు ఉద్యోగాలు మానేస్తే అమెరికాలో వారి పరిస్థితి ఏంటి?
జవాబు : స్టడీ వీసా మీద వెళ్లినవారి తిండి, రూమ్ ఖర్చులను వారే భరించాలి. కోర్సు పూర్తయ్యే వరకు తమ వారే ఇంటి నుంచి డబ్బులు పంపాల్సి ఉంటుంది.
ప్రశ్న : డిపోర్టేషన్లో భాగంగా స్టూడెంట్ వీసాలను కోల్పోతే వారి పరిస్థితి ఏంటి?
జవాబు : విద్యార్థులు కాలేజీలకు కట్టిన డబ్బులు కోల్పోయినట్టే. ప్రత్యామ్నాయం కూడా లేదు.
ప్రశ్న : 2,467 మంది ఇప్పటికీ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో ఉన్నట్టు సమాచారం. వారిని స్వదేశానికి రప్పించడమెలా?
జవాబు : అక్రమంగా నివసిస్తున్నవారికి జడ్జి శిక్ష వేస్తారు. వారందరినీ జైళ్లలో ఉంచుతారు. వారికి డిపోర్టేషన్తో పాటు జరిమానా విధిస్తారు. మళ్లీ అమెరికా వీసా వచ్చే వీలుండదు. ఇతర దేశాలకు మాత్రం వెళ్లొచ్చు. అందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ప్రశ్న : హెచ్1బీ, ఎఫ్1, విజిట్ వీసాలపై ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి?
జవాబు : హెచ్1బీ వీసా పొందినవారు నిర్దేశిత కంపెనీలో మాత్రమే పని చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే వారికీ డిపోర్టేషన్ విధిస్తారు. ఎఫ్1 వీసా హోల్డర్లు ఆథరైజ్డ్ వర్క్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. స్టోర్లలో పని చేయడానికి వీల్లేదు. అలా చేస్తూ పట్టుబడితే నిర్దాక్షిణ్యంగా స్వదేశానికి పంపేస్తారు. విజిట్ వీసా మీద వెళ్లి జాబ్ చేసేవాళ్లకూ డిపోర్టేషన్ విధిస్తారు.
ప్రశ్న : ఉద్యోగం వద్దు.. తమను యూఎస్‌లో ఉండనిస్తే చాలు అన్న ధోరణి భారతీయ విద్యార్థుల్లో నెలకొంది. ఈ పరిస్థితిని ఎలా చూడొచ్చు?
జవాబు : ప్రస్తుత పరిమాణాలు భారతీయ విద్యార్థులకు కొంచెం కష్టతరంగా ఉన్నాయి. సరైన డాక్యుమెంట్లు, జాబ్ ఉంటేనే అమెరికాలో ఉండాలి. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు.