US Iran Ceasefire | ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణ (సీజ్ ఫైర్)ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం ఒక సమగ్ర ప్రతిపాదనను సమర్పించే వరకు ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు.
అమెరికా – ఇరాన్ మధ్య ఈ నెల 8వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు వారాల ఈ సీజ్ ఫైర్ మరో కొద్ది గంటల్లో ముగియనుందనగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పాకిస్థాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినట్లుగా ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు సైనిక చర్యను వాయిదా వేసి, దౌత్య చర్చలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు.
అయితే, సీజ్ ఫైర్ కొనసాగుతున్న సమయంలోనే ఇరాన్‌పై సముద్ర దిగ్భంధనాన్ని (Blockade) కొనసాగించాలని సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు. “ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారు ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం అవసరం. అందుకే ఈ దాడిని నిలిపివేసి, సీజ్ఫైర్ పొడిగించాం” అని తెలిపారు.
బ్లాకేడ్ కొనసాగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఇరాన్ మండిపడింది. ఇది కాల్పుల విరమణకు వ్యతిరేకమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ విమర్శించారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడమంటే యుద్ధ చర్యే అని సమానమని అన్నారు. తమ ప్రయోజనాలను రక్షించుకోవడం ఇరాన్‌కు తెలుసని స్పష్టం చేశారు.
ఇక పాక్‌లో జరగాల్సిన చర్చలకు హాజరుకాకూడదని ఇరాన్ నిర్ణయించుకున్నట్లుగా టస్నీమ్ వార్త సంస్థ వెల్లడించింది. అమెరికా అతిగా డిమాండ్లు చేస్తుందని.. అవి ఒప్పందానికి అడ్డుగా మారుతున్నాయి కాబట్టి చర్చల్లో పాల్గొనడం వ్యర్థమని అభిప్రాయపడుతున్నట్లుగా పేర్కొంది.