వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. కమలా భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అని ట్రంప్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. హారిస్ భారతీయురాలని తనకు తెలుసని, ఆమె కొన్నేళ్ల క్రితం నల్ల జాతీయురాలిగా మారే వరకు ఆమె నల్లజాతీయురాలనే విషయం తెలియదని చెప్పారు. ఇప్పుడు హఠాత్తుగా నల్ల జాతీయురాలిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. దీనికి కొనసాగింపుగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో కమలా హారిస్‌కు చెందిన ఓ ఫొటోను ట్రంప్ షేర్ చేశారు. చాలా ఏండ్ల క్రితం మీరు మంచి ఫొటోను షేర్ చేసినందుకు ధన్యవాదాలు కమలా. భారతీయ వారసత్వం పట్ల మీ ఆప్యాయత, స్నేహం, ప్రేమ ప్రశంసించదగినవి అంటూ వ్యాఖ్యానించారు. కాగా, చక్కని చీరకట్టులో ఉన్న కమలా హారిస్.. చిరునవ్వులు చిందిస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఫొటో కనిపించారు.
షికాగోలో బుధవారం జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కన్వెన్షన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. గతంలో భారతీయ వారసత్వం గురించి చెప్పుకున్న ఆమె అకస్మాత్తుగా నల్లజాతి వైపు మలుపు తిరిగారని, ఎవరైనా దానిని పరిశీలించాలన్నారు. న్యాయవాదిగా ఆమె బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని, పాస్ అవుతానని కూడా ఆమె అనుకోలేదని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. అయితే దీనిపై కమలా హారిస్ గట్టిగే బదులిచ్చారు. ట్రంప్ మళ్లీ తన పాత విభజన సిద్ధాంతాన్నే ముందుకు తెస్తున్నారని, అగౌరవపరిచే ధోరణి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ట్రంప్ లాటి నాయకులను తాను చాలామందిని చూశానంటూ విమర్శలు గుప్పించారు.