Donald Trump : హార్ముజ్ జలసంధి అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పతనమైందని, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని తమకు ఇరాన్ తెలిపినట్లు ట్రంప్ అన్నారు. పతనం అంచున ఉన్నందున తాము హార్ముజ్ జలసంధిని వెంటనే తెరుస్తామని ఇరాన్ కోరిందని ట్రంప్ వెల్లడించారు.
అయితే, ఈ అంశంపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, హార్ముజ్‌ను తెరిచేందుకు ఇరాన్ ఇటీవల అమెరికాకు షరతు విధించిన సంగతి తెలిసిందే. హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధనం నుంచి తొలగిస్తేనే తాము ఈ జలసంధిని తెరుస్తామని ప్రకటించింది. ఈ జలసంధిపై ఇరాన్ దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ చిన్న జలసంధి ప్రపంచ సముద్ర రవాణా మార్గానికి కీలకం. ముఖ్యంగా చమురు సరఫరాకు కీలకంగా మారింది. పాశ్చాత్య దేశాలు ఇరాన్ చమురుపై ఆంక్షలు విధించడంతో ఆయా దేశాల సరుకుల రవాణాపై ఇరాన్ నిషేధం విధిస్తూ, హార్ముజ్‌ను చెక్ పాయింట్‌గా వాడుకుంటోంది.
అయితే, ఈ ప్రాంతాన్ని, ప్రపంచ వ్యాపారాన్ని అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదనేది ఇరాన్ మాట. కానీ, హార్ముజ్‌ను తమ అధీనంలో ఉంచుకోవడం హక్కని చెబుతోంది. మరోవైపు ఇరాన్‌కు నాయకత్వ లేమి సమస్య ఉందని ట్రంప్ భావిస్తున్నారు. చర్చల్లో ఈ అంశం ప్రతికూలంగా మారిందన్నారు. మరోవైపు ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికే అంశంలో ఇరాన్ ప్రతిపాదనల్ని ట్రంప్ తోసిపుచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో చర్చల అంశంలో ఇంకా ఎలాంటి ముందడుగు పడటం లేదు.