Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాను ఏడు యుద్ధాలు (Seven wars) ఆపానని ఇన్నాళ్లుగా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. తనని తాను శాంతి దూతగా చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన మాట మార్చారు. తాను మూడు యుద్ధాలు (Three wars) ఆపానని చెప్పారు. వాటిలో ఒక 31 ఏళ్లుగా కోటి మంది ప్రాణాలు తీసిన యుద్ధమని, మరొకటి 34 ఏళ్లుగా సాగుతున్న యుద్ధమని, ఇంకొకటి 37 ఏళ్లుగా సాగుతున్న యుద్ధమని తెలిపారు. కానీ అవి ఏయే దేశాల మధ్య యుద్ధాలో ట్రంప్ చెప్పలేదు.
అమెరికాలోని ప్రముఖ టెక్ సంస్థల అధిపతులు, సీఈవోలకు.. ట్రంప్, ఆయన సతీమణి మెలానియా వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘మీకు తెలుసా.. నేను ఇప్పటి వరకు మూడు యుద్ధాలు ఆపా. అందులో ఒకటి 31 ఏళ్లపాటు సాగింది. ఆ యుద్ధంలో కోటి మంది మరణించారు. మరో యుద్ధం 34 ఏళ్లు, ఇంకో యుద్ధం 37 ఏళ్లు సాగాయి. ఆ మూడు యుద్ధాలు నేను ఆపా’ అని చెప్పారు.
అయితే ఆయన ఏయే దేశాల మధ్య యుద్ధాల గురించి చెప్పారో ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. అప్పట్లో.. ‘ఆ యుద్ధాలు మీరు ఆపలేరు’ అని ప్రజలు తనతో చాలాసార్లు అన్నారని గుర్తుచేశారు. కానీ, వాటిని తాను ఆపగలిగానని చెప్పారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం క్లిష్టతరంగా ఉందని, అయినా తాను దాన్ని కూడా ఆపుతానని ధీమా వ్యక్తంచేశారు. అయితే ఇన్నాళ్లూ ఏడు యుద్ధాలు ఆపానని చెబుతూ వచ్చిన ట్రంప్.. ఇప్పుడు మూడు యుద్ధాలు అని చెప్పడం మాటపై ఆయన కచ్చితత్వానికి నిదర్శనమని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
కాగా థాయ్‌లాండ్ -కంబోడియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-హమాస్, రవాండా-డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా-కొసావో, ఈజిప్ట్-ఇథియోపియా దేశాల మధ్య ఘర్షణలను అధ్యక్షుడు ట్రంప్ ఆపారని వైట్‌హౌస్ పలుమార్లు చెప్పుకుంది. ఈ క్రమంలో ఆయన పేరును కొందరు నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ చేశారు. ఇక భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని కూడా ట్రంప్ ఈ మధ్యకాలంలో పదేపదే చెబుతూ వస్తున్నారు. అయితే భారత్ ఆయన వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశ ప్రమేయం లేదని ప్రధాని మోదీ కూడా స్పష్టంచేశారు.