OPT Students | వాషింగ్టన్ డీసీ, మే 28: ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) కింద అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు (OPT Students ) ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎస్ఈవీఐఎస్)లో ఉద్యోగ వివరాలను అప్డేట్ చేయాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా సరైన వివరాలను నమోదు చేయకపోతే స్వదేశాలకు పంపేస్తామని (డిపోర్ట్) హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) పలువురు విద్యార్థులకు నోటీసులు ఇచ్చింది. ‘మీ ఎస్ఈవీఐఎస్ రికార్డుల్లో ఉద్యోగం చేస్తున్న సంస్థ వివరాలను సరిగా పొందుపరచలేదు. ఒకవేళ సరైన వివరాలతో అప్డేట్ చేయకపోతే మిమ్మల్ని నిరుద్యోగులుగా పరిగణిస్తాం.
ఓపీటీ పరిమితి పూర్తయితే మీ స్వదేశాలకు పంపాల్సి వస్తుంది’ అని స్పష్టం చేసింది. డీఎస్వో (డిజిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్)ను సంప్రదించి తాజా ఉద్యోగ వివరాలను సమర్పించాలని సూచించింది. దీంతో అమెరికాలోని వేలాది మంది ఓపీటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో 2.70 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 69 వేల మంది ఓపీటీ ప్రోగ్రామ్లో భాగస్వాములుగా ఉన్నారు. ఇందులో చాలామందికి ట్రంప్ సర్కార్ నోటీసులు ఇస్తున్నట్టు విద్యార్థులు చెప్తున్నారు.
అమెరికాలో చదువు పూర్తయిన విదేశీ విద్యార్థులు అక్కడ పని అనుభవం పొందేందుకు ఇచ్చే అవకాశమే ఓపీటీ. ఎఫ్-1 వీసాపై అమెరికా వెళ్లి బ్యాచిలర్స్ లేదా ఎమ్మెస్ పూర్తి చేసిన విద్యార్థులకు 12 నెలలపాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసేందుకు అవకాశం ఇస్తారు. ఏడాది కాలంలో 90 రోజులు మాత్రమే నిరుద్యోగిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఓపీటీకి ఎంపికైనప్పటి నుంచి దీనిని లెక్కిస్తుంటారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (ఎస్టీఈఎం) సబ్జెక్టులు చదివిన వారికి అదనంగా రెండు సంవత్సరాలు ఓపీటీ ఇస్తారు. దీనిని ఎస్టీఈఎం-ఓపీటీ అంటారు. వీరికి అదనంగా మరో 60 రోజులు నిరుద్యోగిగా ఉండే అవకాశం లభిస్తుంది. నిర్ణీత కాలంలో హెచ్1బీ వీసా స్పాన్సర్ చేసే ఉద్యోగం వెతుక్కొని, లాటరీలో వీసా వస్తే అక్కడే ఉంటూ ఉద్యోగం కొనసాగించవచ్చు. లేకపోతే గడువు ముగిసిన తర్వాత స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది.
తమ ఉద్యోగ వివరాలను పర్యవేక్షించే బాధ్యత డీఎస్వోలదని ఓపీటీ విద్యార్థులు చెప్తున్నారు. ఈ వ్యవహారాల్లో ఇమ్మిగ్రేషన్ విభాగం జోక్యం చేసుకోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై నిఘా పెంచిందని అర్థమవుతున్నదని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా వివరాలు నమోదు చేయకపోతే ఎస్ఈవీఐఎస్ రికార్డులను తొలిగిస్తామని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్తున్నారని, ఇదే జరిగితే ఆయా విద్యార్థులు స్వదేశాలకు తిరిగి వెళ్లడం మినహా మరో మార్గం ఉండదన్నారు. దీనిని బట్టి విదేశీ విద్యార్థులను డిపోర్ట్ చేయడానికి ట్రంప్ సర్కార్ అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నట్టు అర్థమవుతున్నదన్నారు. కొన్ని సందర్భాల్లో తమ ఉద్యోగ వివరాలను డీఎస్వోకు ఇచ్చినా, నమోదు చేయడంలో ఆలస్యం చేస్తున్నారని, ఆ ప్రభావం కూడా తమపై పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఓపీటీ విద్యార్థులు కొత్తగా ఉద్యోగంలో చేరినా, కంపెనీ మారినా, బదిలీ అయినా, ఉద్యోగం కోల్పోయినా పది రోజుల్లోగా ఎస్ఈవీఐఎస్ రికార్డుల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కానీ చాలా మంది సంస్థ వివరాలను నమోదు చేయడం లేదన్నారు. దీంతో వారు నిజంగానే ఉద్యోగాలు చేస్తున్నారో లేదో తెలియడం లేదన్నారు. అందుకే ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు.
ఓపీటీ విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని, అయితే కొన్ని సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓపీటీ కాలంలో ఎక్కడ, ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తున్నారో పూర్తి వివరాలతో సొంతంగా రికార్డు తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. కంపెనీ పేరు, హోదా, సూపర్వైజర్ పేరు, వారానికి ఎన్ని గంటల పనిచేశారు.. వంటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. డీఎస్వోల నిర్లక్ష్యంతో ఏదైనా పొరబాటు జరిగితే ఈ వివరాలు ఉపయోగపడతాయన్నారు. ఇక ఓపీటీ నిబంధన ప్రకారం 90/150 రోజుల గడువు పూర్తయిన వారు వెంటనే స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. లేదా మరో కోర్సులో చేరి ఎఫ్-1 వీసా గడువు పొడిగించుకోవచ్చన్నారు. చివరి అవకాశంగా స్టూడెంట్ వీసా నుంచి టూరిస్ట్ వీసాకు (బీ-2) మార్చుకోవాలని సూచిస్తున్నారు.