వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సుంకాలతో విరుచుకుపడ్డారు. ఫార్మా దిగుమతులపై (Pharma Imports) భారీగా సుంకాలు (Trump Tariffs) విధిస్తూ బాంబు పేల్చారు. బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించవని పేర్కొన్నారు.
అదేవిధంగా అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం (Upholstered Furniture), భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే కిచెన్ క్యాబినెట్(Kitchen Cabinets), బాత్రూమ్ వానిటీలపై 50 శాతం టారీఫ్‌లు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామన్నారు. జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్ ద్వారా ట్రంప్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ ఫార్మా పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత ఫార్మా కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తంగా 27.9 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 8.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు అమెరికాకే ఎగుమతి అయ్యాయి. అంటే మొత్తం ఎగుతుల్లో ఇది 31 శాతం. ఇక అగ్రరాజ్యంలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45 శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15 శాతం మన దేశం నుంచి సరఫరా చేసినవే కావడం గమనార్హం.