న్యూయార్క్: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో డ్రాగన్ దేశం చైనా జోక్యం చేసుకున్నట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోపించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 2020 దేశాధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నదని, అమెరికా ఓటింగ్ విధానం తీవ్ర ప్రభావానికి గురైందని, అయితే ఓటర్లను మార్చిన అంశంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికల ఫలితాలను కూడా మార్చినట్లు ట్రంప్ నేరుగా పేర్కొనలేదు. వైట్‌హౌజ్ నుంచి ఆయన మాట్లాడుతూ.. ఓటింగ్ ఫ్రాడ్ జరిగినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలను మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. 2020 దేశాధ్యక్ష ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ పోరులో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓటమి పాలయ్యారు.
మిడ్‌టర్మ్ ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ తాజాగా ప్రసంగం చేశారు. ఇంటెలిజెన్స్‌కు చెందిన వందలాది ఫైళ్లను డీక్లాసిఫై చేశానని, అయితే బైడెన్‌కు అనుకూలంగా దేశాధ్యక్ష ఎన్నికలను చైనా ప్రభావితం చేసినట్లు ఆ ఫైళ్లలో ఉందని ట్రంప్ తెలిపారు. కానీ 2020 ఎన్నికల్లో చైనా జోక్యం లేదని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం చెబుతూనే ఉన్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు చైనా విదేశాంగ శాఖ తీవ్రంగా కౌంటర్ ఇచ్చింది. ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలు అని పేర్కొన్నది. ఎటువంటి ఆధారాలు లేని వ్యాఖ్యలను ట్రంప్ చేస్తున్నారని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. చైనా సుమారు 22 కోట్ల ఓటర్ ఫైళ్లను అక్రమ రీతిలో సేకరించినట్లు ట్రంప్ ఆరోపించారు. సుమారు 18 రాష్ట్రాల్లో ఓటరు డేటాను చైనా హ్యాక్ చేసిందన్నారు. అయితే ఓటరు డేటా ఆధారంగా ఎన్నికల వ్యవస్థపై చైనా ప్రభావం చూపినట్లుగా ట్రంప్ ఎటువంటి ఆధారాలను తన ప్రసంగంలో వెల్లడించలేదు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్, బ్యాలెట్ కౌంటింగ్ వ్యవస్థల్లో అక్రమాలు జరిగినట్లు వైట్‌హౌజ్ సుమారు నాలుగు సెక్షన్ల డాక్యుమెంట్లను రిలీజ్ చేసింది. అమెరికా ఓటరు డేటాను చైనా దుర్వినియోగం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు.