బీజింగ్: చైనాను మరోసారి కరోనా వణికిస్తున్నది. ఆ దేశ ఆర్థిక రాజధాని షాంఘైలో ఇటీవల రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. సుమారు 2.6 కోట్ల జనాభా ఉన్న షాంఘైలో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడాన్ని నిషేధించారు. లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్‌ను కూడా నిలిపివేశారు. వంతెనలు, టన్నల్స్ను మూసివేశారు. ప్రజలు తమ ఇండ్ల పరిధిలోని ఓపెన్ ఏరియాల్లో కూడా నడవకూడదని ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జన సంచారం లేక షాంఘై రోడ్లు బోసిపోయాయి. అయితే కుక్క లాంటి ఒక రోబో ఖాళీ రోడ్లపై పరుగులు తీసింది. దానిపై అమర్చిన మైక్ ద్వారా కరోనాకు సంబంధించిన ప్రకటనలు, ఆరోగ్యంపై ప్రజలకు సూచనలు చేసింది. ఈ వీడియోను ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చైనా టెక్నాలజీ అద్భుతమంటూ కొందరు నెటిజన్లు కొనియాడారు.
Robot roaming the streets making health announcements in #Shanghai during lockdown. pic.twitter.com/64x0mU4C2D
— Eric Feigl-Ding (@DrEricDing) March 31, 2022