సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): చైనా మాంజా నగర ప్రజల గొంతు కోస్తోంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లే ద్విచక్రవాహనదారుల పాలిట ఈ చైనా మాంజా యమపాశంగా మారుతోంది. ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి మెడకు చుట్టుకుంటుందో తెలియక వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. నైలాన్ సింథటిక్ ఫైబర్‌తో తయారు చేసిన చైనీస్ మాంజాకు గాజుపొడి, లోహపు చూర్ణం పూత ఉండటంతో అత్యంత పదునుగా, ప్రమాదకరంగా మారుతోంది. ఈ మాంజా ఒకసారిగా వేగంగా మెడకు చుట్టుకుంటే తీవ్ర రక్తస్రావం జరిగి, ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఆకాశంలో ఎగిరే గాలిపటం ఆనంద హేతువైతే, అదే రోడ్డుపై పడే మాంజా దారం మృత్యువుకు కారణం అవుతోంది.
మనుషులకే కాకుండా జంతువులు, పక్షుల ప్రాణాలకు కూడా ఈ మాంజా ముప్పుగా పరిణమిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఒక్కరోజే నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు చైనా మాంజా బారినపడి తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరిలో విశాఖపట్నం ప్రాంతానికి చెందిన కుంధం సూర్యతేజ(33) ఆదివారం పనిమీద బయటకు వెళ్లి, తిరిగి గచ్చిబౌలి నుంచి ద్విచక్రవాహనంపై కొండాపూర్ బొటానికల్ గార్డెన్ ైప్లెఒవర్ మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా చైనామంజా తన భుజానికి తగిలి భుజం నుంచి ఛాతీ వరకు తీవ్ర రక్తస్రావమై గాయాలకు గురయ్యాడు. మరో కేసులో ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ సాయివరన్ధన్రెడ్డి చైనా మాంజాతో తీవ్రంగా గాయపడ్డాడు. మెడపై లోతైన గాయం కావడంతో చికిత్స కోసం స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు.
చైనా మాంజాతో అమాయక ప్రజల గొంతులు తెగి ప్రాణాలు పోతుంటే పోలీసులు మాత్రం కంటితుడుపు చర్యగా సూచనలు జారీ చేయడం, ట్వీట్లతో సరిపెడుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే నగరంలోకి చైనా మాంజా ఎలా వస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గాలిపటాలు, మాంజా తయారీ, విక్రయాలు జరిపే నగరంలోని ధూల్‌పేట, మంగళ్‌హాట్‌లో పోలీసులు తనిఖీలు జరిపిన దాఖలాలు పెద్దగా లేవని అక్కడే కాకుండా నగరంలోని గాలిపటాల విక్రయ, తయారీ కేంద్రాల్లో మాంజా తయారీ, విక్రయాలపై పోలీసులు నిఘాపెడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావాంటున్నారు జనం. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు జనం గొంతు కోస్తున్న చైనా మాంజా తయారీ, విక్రయాలను అరికట్డడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైనట్లు ప్రజలు విమర్శిస్తున్నారు.
గత సంవత్సరం లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ ఆర్మీ జవాన్ మెడకు చైనీస్ మాజా తాకడంతో తీవ్రంగా గాయపడిన జవాన్ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. గతంలో ఎల్బీనగర్ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న చిన్నారి మెడకు మాంజా కోసుకోవడంతో మృత్యువాత పడింది. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ – చందానగర్ ప్రధాన రహదారి, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఇటీవలి కాలం లో ద్విచక్ర వాహనదారుల మెడలకు చైనీస్ మాంజా చికి తీవ్ర గాయాలపాలైన ఘటనలు కలకలం రేపాయి. బాలానగర్ రహదారిపై ట్రాఫిక్ మధ్యలో ద్విచక్ర వాహనదారుడి మెడకు దారం తగలడం వలన మెడకు తీవ్ర గాయమయ్యింది. అపార్ట్ మెంట్లు, మేడలపై నుంచి గాలిపటాలు ఎగురవేయడం కారణంగా మాంజా చెట్ల కొమ్మలకు, విద్యుత్ తీగలకు చికి రోడ్డుపై వేలాడటం కారణంగా ప్రమాదాలకు దారి తీస్తోంది. మూగజీవాలకూ తప్పని ముప్పు మనుషులకే కాకుండా పక్షులు, ఇతర మూగజీవలకూ ఈ మాంజా వల్ల ప్రాణ నష్టం తప్పడం లేదు. పిచ్చుకలు, కాకులు, గద్దలు, రెకలకు దారాలు చికి ఎగరలేక మృత్యువాత పడుతున్నాయి. వీధి కుకలు, పశువుల కాళ్లకు దారాలు చుట్టుకుని గాయాలవుతున్నాయి. మాంజా వల్ల ఇప్పటికే ఎన్నో పక్షులు, మూగ జీవాలు మృత్యువాత పడిన సంఘటనలు కోకొల్లలు.
నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న చైనా మాంజా ఘటనల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పతంగ్ ఉండావ్….గర్దన్ మత్ కాటో…’అంటే అచ్చమైన పాతబస్తీ యాసలో ట్వీట్ చేశారు. చైనా మాంజా వాడితే సీదా అందర్(జైలుకు) అంటూ హెచ్చరించారు.
ప్రజలు, మూగ జీవాల ప్రాణాల భద్రతను దృష్టిలో పట్టుకుని చైనీజ్ మాంజా విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ మాంజాను విక్రయించినా లేకా వినియోగించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సైరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా వారం రోజులుగా కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు చైనీస్ మాంజా విక్రయదారులపై 53 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శేరిలింగంపల్లి, జనవరి 11: చైనా మంజా తగిలి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం నగరం పెద్దవాల్తేరు విజయనగర్ కాలనీకి చెందిన కుంధం సూర్యతేజ(33) నగరానికి వలస వచ్చి మియాపూర్ ఎస్ఆర్ ఎస్టేట్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సూర్యతేజ పనిమీద బయటకు వచ్చి తిరిగి గచ్చిబౌలి నుంచి తన ద్విచక్రవాహనంపై మియాపూర్‌లోని ఇంటికి వెళ్తున్నాడు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ ైప్లెఒవర్ మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా చైనామంజా భుజానికి తగిలి భుజం నుంచి ఛాతీ వరకు తీవ్రరక్తస్రావమైంది. అతడి స్నేహితులు సూర్యతేజను హాస్పటల్‌కు తరలించారు.