అబిడ్స్, జనవరి 11: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో సందర్శకుల సందడి నెలకొంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సందర్శకులు భారీగా తరలి వచ్చి స్టాల్లను సందర్శించడంతో పాటు కొనుగోళ్లను చేపట్టారు. ప్రతి సంవత్సరం జనవరి 1నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన కొనసాగుతున్నది.
ఈ సంవత్సరం జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్‌కు ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షలకు పైగా సందర్శకులు సందర్శించారు. ప్రతి సంవత్సరం 46 రోజుల పాటు కొనసాగే నుమాయిష్‌కు 25 లక్షల పై చిలుకు సందర్శకులు సందర్శించే అవకాశాలుంటాయని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్ సుఖేష్ రెడ్డి, కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్ తెలిపారు. నుమాయిష్ సందర్శనకు వచ్చే సందర్శకులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించడంతో పాటు అంతర్గత సెక్యూరిటీ, పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.