వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పాల్గొన్న డిన్నర్ పార్టీలో కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తిపై అభియోగాలు నమోదు చేశారు. దేశాధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆ నిందితుడిపై కేసు బుక్ చేశారు. ఒకవేళ అతను ఆ కేసులో దోషిగా తేలితే అతనికి జీవితకాల శిక్ష పడే అవకాశం ఉన్నది. కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల నిందితుడు కోల్ టోమస్ అల్లెన్ను ఫెడరల్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్‌హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్ పార్టీ జరుగుతున్న సమయంలో నిందితుడు అల్లెన్ ఆయుధాలతో బాల్‌రూమ్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సీక్రెట్ ఏజెంట్లు అతన్ని అడ్డుకున్నారు. ఆరేడు రౌండ్ల కాల్పులు జరిపాడతను.
అయితే సీక్రెట్ ఏజెంట్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. దేశాధ్యక్షుడు ట్రంప్‌ను ఆ నిందితుడు హతమార్చే ప్రయత్నం చేశాడని ప్రాసిక్యూరట్ జోసిలిన్ బల్లెంటైన్ ఆరోపించారు. 2024లో ఎన్నికల ప్రచార సమయంలో కూడా ట్రంప్‌పై రెండు సార్లు హత్యాయత్నం ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంకే మాట్లాడుతూ ట్రంప్‌ను అల్లెన్ టార్గెట్ చేసినట్లు విచారణ అధికారులు భావిస్తున్నారన్నారు. దేశాధ్యక్షుడిని దేశద్రోహి అని ఓ ఈమెయిల్లో అతను రాశాడని, దీని వల్ల అతను ట్రంప్‌పై కక్ష కట్టినట్లు తెలుస్తోందన్నారు. ప్రజాజీవితంలో హింసకు తావులేదని బ్లాంకే అన్నారు.
నిందితుడు అల్లెన్ 12 గేజ్ పంప్ యాక్షన్ షాట్‌గన్, మూడు కత్తులతో వాషింగ్టన్కు వచ్చినట్లు తాత్కాలిక అటార్నీ తెలిపారు. రాక్ ఐలాండ్ ఆర్మరీ 1911.38 క్యాలిబర్ సెమీ ఆటోమెటిక్ హ్యాండ్‌గన్ కూడా అతని వద్ద ఉన్నట్లు తేల్చారు. డిన్నర్ పార్టీ వద్ద ఫైరింగ్ జరిపిన షాట్‌గన్ షెల్‌ను కూడా రికవరీ చేశారు. కోర్టులో ఆరోపణలు చేస్తున్న సమయంలో అల్లెన్ ఏమీ మాట్లాడలేదు. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నట్లు నిందితుడు తెలిపాడు. గతంలో అల్లెన్‌కు ఎటువంటి అరెస్టులు కానీ ఆరోపణలు కానీ లేవని డిఫెన్స్ లాయర్ తేజిరా అబే తెలిపారు. వచ్చే గురువారం వరకు అల్లెన్ను కస్టడీలో ఉంచాలని అమెరికా మెజిస్ట్రేట్ జడ్జీ మాథ్యూ షార్‌బాగ్ తెలిపారు. మరిన్ని అదనపు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు వాషింగ్టన్‌లోని అటార్నీ జీనైన్ పిరో తెలిపారు.
ఏప్రిల్ 6వ తేదీన వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో అల్లెన్ రూమ్ బుక్ చేసుకున్నాడు. కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ వరకు అతను గత వారం రైలులో ప్రయాణించినట్లు ఎఫ్‌బీఐ తన స్టేట్మెంట్లో తెలిపింది. శనివారం తమ కుటుంబసభ్యులకు పంపిన ఈమెయిల్లో ట్రంప్ పరిపాలనా బృందాన్ని హతమార్చాలని ప్లాన్ వేసినట్లు పేర్కొన్నాడు.